దర్శకరత్న నారాయణరావు-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందట. ఇది అసాధారణ కలయికలా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. దాసరి డైరెక్షన్ లో పవన్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ దాసరి నారాయణరావు మాత్రం పవన్ తో తాను సినిమా చేస్తున్నట్టు తెలిపారు. తారక ప్రభు ఫిల్మ్స్ బేనర్ పై భారీ బడ్జెట్ మూవీని త్వరలోనే తీయబోతున్నట్టు వెల్లడి చేశారు. ఈ విషయం తెలిసి, అటు ఇండస్ట్రీలోనూ, ఇటు సామాన్యుల్లోనూ అనేకానేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పవన్ స్వయంగా స్క్రిప్టు చూసి గానీ ఏ సినిమాకైనా అంగీకరించరు. చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ సినిమాలను ఎంచుకుంటాడు. మరి దాసరి స్క్రిప్టు చూడకుండా అంగీకరించారా? అసలు ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ ఎవరు? మెగా ఫ్యామిలీతో దర్శక రత్న దాసరి నారాయణరావుగారి సంబంధాల గురించి అందరికీ తెలుసు. వీటన్నిటికీ సమాధానం ఈ ఇరువురే తెలియజేయాలి. ఇప్పటికే పవర్ స్టార్ చేతిలో ‘గబ్బర్ సింగ్ 2’ ప్రాజెక్టు ఉంది. మరి పవన్ ఏ ప్రాజెక్టును మొదట మొదలు పెడతారో వేచి చూడాల్సిందే.