ఈ మధ్య కథ ఏమీ లేకుండానే సినిమాల్లో జోకులు, ఫైటింగులు వంటి ఎంటర్టైన్ మెంట్ తో సినిమా కానిచ్చేస్తున్నారు. అందులో కొన్ని హిట్లు కూడా ఉన్నాయనుకోండి అది వేరే విషయం కానీ, వైవిధ్యమైన కథలతో చిత్రాలు తీసే దర్శకుడు ప్రభు సాల్మన్. ఈయన సారధ్యంలో తాజాగా ధనుష్ హీరోగా ఓ సినిమా తీయబోతున్నారు. మైనా, కుంకీ, కయల్ వంటి కథాబలం ఉన్న చిత్రాలను తెరకెక్కించిన ఈయన ప్రస్తుతం స్టార్ హీరోలను నమ్ముకునే చిత్రాలు తీస్తున్నారు. ప్రస్తుతం ఈయన తీయబోయే చిత్రం కమర్షియల్ పాళ్లు ఎక్కువగా జోడించనున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిల్మ్స్ పతాకంపై అర్జున్ త్యాగరాజన్, సెంథిల్ త్యాగరాజన్లు నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం గురించి చిత్ర నిర్వాహకుడు రాహుల్ వెల్లడిస్తూ, ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను మార్చి నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. సాధారణంగా ప్రభు సాల్మన్ లొకేషన్లకు చాలా ప్రాముఖ్యతనిస్తారనీ, ప్రస్తుతం ఆయన ఆ పనిలో ఉన్నారని తెలిపారు. ఈ చిత్రం సత్యజ్యోతి ఫిల్మ్ సంస్థకు 30వ సినిమా అవుతుందన్నారు.. ప్రస్తుతం ధనుష్ ’మారి‘ అనే చిత్రంలో నటి స్తున్నారు. మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే ప్రభు సాల్మన్ చిత్రం ప్రారంభమవుతుందని తెలిపారు.