దేశంలో అత్యంత పెద్ద బిజినెస్ చేస్తున్న పరిశ్రమ అంటే బాలీవుడ్ అనే చెప్పాలి. ప్రతి ఏడాది వందల సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయితే ప్రతి ఏటా ఇచ్చే ఫిలిం ఫేర్ అవార్డుల కోసం వందల సంఖ్యలో నటుటు పోటీ పడుతుంటారు. సినిమాలు రిలీజ్ అయ్యి వాటి సక్సెస్ ను అందులో నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్ ను బట్టి ముందుగా ఎవరిని ఈ అవార్డును వరిస్తుందో ఊహించేస్తారు కూడా. గత ఏడాది విడుదలైన సినిమాలకు సంబంధించి ఏ అవార్డుల కార్యక్రమం జరిగినా, కంగనా రనౌత్ కే ఈ అవార్డు దక్కుతుందని అందరూ ముందుగానే అనుకుంటున్నారంటే ఆమె నటన ఏ లెవెల్ లో ఉందో ముందుగానే ఊహించవచ్చు. ఓ ఇంటర్వ్యూలో కంగనా కూడా అవార్డు ఇంకెవరికి నాకే నంటూ ధీమాగా చెప్పేసింది. ఇప్పటికే ‘క్వీన్’ సినిమాకు చాలా అవార్డులే దక్కాయి ఆమెకు. ఆమె అన్నట్టుగానే 2014 ఫిలింఫేర్ ఉత్తమ నటిగా కంగనానే ఎంపికైంది. విశేషమేమిటంటే, క్వీన్ సినిమా ఏకంగా 6 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్, నేపథ్య సంగీతం అవార్డులు కూడా ‘క్వీన్’కే దక్కాయి. ఉత్తమ నటుడిగా ‘హైదర్’ కథనాయకుడు షాహిద్ కపూర్ ఎంపికయ్యాడు. ఎప్పుడూ స్టార్ ఇమేజ్ కు ప్రాధాన్యమిచ్చే ఫిలిం ఫేర్ పురస్కారాల్లో ఈసారి పక్కాగా పెర్ఫార్మెన్స్ కే పెద్ద పీట వేయడం మెచ్చుకోదగినది.