చిన్న బడ్జెట్ చిత్రంగా వచ్చి బాలీవుడ్ లో వంద కోట్లు కొల్లగొట్టింది ఓ మై గాడ్ చిత్రం. పరేష్ రావెల్ లీడ్ రోల్ కాగా అక్షయ్ కుమార్ కృష్ణుడి పాత్రలో మెరిశాడు. దేవుడిపైనే కేసు వేసే ఓ నాస్తికుడి కథాంశంతో తెరకెక్కింది చిత్రం. ఇదే చిత్రాన్ని గతేడాది దర్శకుడు డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో గోపాల గోపాలగా తెరకెక్కించాడు. ఈ చిత్రం ఇక్కడా బాగానే ఆడింది. నిర్మాతకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయినప్పటికీ మరో మల్టీస్టారర్ కావటంతో ఫ్యామిలీ జనాలు బాగానే ఆదరించారు.
ఇక ఈ చిత్రం త్వరలో కన్నడలో కూడా రీమేక్ కానుంది. దీంట్లో హీరోలుగా టాప్ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లను ఎంపిక చేశారు కూడా. ముందుగా చిత్రంలో వెంకీ రోల్ ను ఉపేంద్ర, కృష్ణుడి పాత్రలో సుదీప్ కనిపిస్తారని టాక్ నడిచింది. కథానుసారం లీడ్ రోల్ హీరో నాస్తికుడిగా నటించాలి. దానికి ఉప్పీ అయితే ఫర్ ఫెక్ట్ గా ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సుదీప్. ఆ పాత్రను తానే పోషించబోతున్నట్లు, కృష్ణుడి పాత్రను మాత్రం ఉపేంద్ర పోషించనున్నట్లు చెప్పాడు.
రీమేక్ లతో భారీ బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరో సుదీప్. గతంలో మిర్చిని మాణిక్య, అత్తారింటికి దారేదిని రణ్ణగా తెరకెక్కించి కలెక్షన్లు రాబట్టాడు. ఇప్పుడు మరోసారి పవన్ సినిమాతోనే మ్యాజిక్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ముకుందా మురారిగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.