నాలుగేళ్ళకే సినీ జీవితాన్ని ఆరంభించి ఇప్పటికీ అభిమాన తారగా... రూప్ కీ రాణిగా తళుక్కుమంటున్న తార శ్రీదేవి. ఈ రోజు ఆమె 53వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఇక ఆమె సినీ జీవితాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే... ఆమె ఆగస్టు 13, 1963లో జన్మించింది. బాల నటిగా 1967 లో తునైవన్ అనే తమిళ సినిమాలో నటించింది. ఈమె ఎన్నో మళయాళం, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల్లో బాల నటిగా నటించింది. ఈమె తమిళ సినిమాలో కె.బాలచందర్ దర్శకత్వంలో మూండ్రు ముడిచ్చు అనే సినిమాలో హీరోయిన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ సరసన నటించింది. తెలుగులో ‘అనురాగాలు’ అనే సినిమాలో తన 13 ఏళ్ళ వయసులో ఒక గుడ్డి అమ్మాయి పాత్రలో హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే ‘16 ఏళ్ళ వయసు’ ఈ సినిమా తరువాత తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఎన్టీఆర్, నాగేశ్వర్రావు, శోభన్ బాబు, కృష్ణ తదితర అగ్రనటుల సరసన హీరోయిన్ గా నటించింది. ఈమె రికార్డ్ ను బ్రేక్ చేయగల నటీమణులు ఆ తరువాత మరెవరూ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఎన్టీఆర్ సరసన బడిపంతులు సినిమాలో ఆయనకు మనుమరాలిగా నటించి ఆ తరువాత ఆయనకు హీరోయిన్ గా వేటగాడు, బొబ్బిలిపులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు వంటి పలు చిత్రాల్లో నటించింది. ఇక ఇంకొక రికార్డ్ బ్రేక్ ఏమిటంటే... నాగేశ్వర్ రావుకు హీరోయిన్ గా ప్రేమాభిశేఖం చిత్రంలో నటించింది ఆయన కుమారుడు అక్కినేని నాగార్జునతో ఆఖరి పోరాటంలోనూ నటించింది. కృష్ణతో బుర్రిపాలెం బుల్లోడు, ముద్దుల కొడుకు, బంగారు కానుక, కలవారి సంసారం తదితర చిత్రాల్లో నటించింది. శోభన్ బాబుతో కార్తీక దీపం, చిరంజీవితో మోసగాడు, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాల్లో నటించి, వెండితెర ఎవర్గ్రీన్ గ్లామర్ క్వీన్ పేరును సొంతం చేసుకుంది. ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంటరై అక్కడ కూడా జితేంద్ర, అనీల్ కపూర్ లాంటి అగ్ర నటులతో నటించింది. తరాలు మారినా తరగని అందం, చెక్కుచెదరని సొగసుకు కేరాఫ్ అడ్రెస్ శ్రీదేవిగా ఎక్కువకాలం అంటే దాదాపు 30 ఏళ్ళు వెండితెరపై హీరోయిన్ గా నటించిన రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సూపర్‌హిట్ అయ్యేసరికి శ్రీదేవి డేట్స్ కోసం బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా సినిమాల నిర్మాతలు కూడా పరుగులు తీశారు. ప్రస్తుతం తమిళ చిత్రం 'పులి'లో మహారాణిగా నటిస్తోంది. బాహుబలి శివగామి పాత్రకోసం మొదట ఆమెను సంప్రదించగా రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందని ఆ తరువాత రమ్యకృష్ణను అడిగినట్టు ఓ వార్త వినిపించింది. రీ ఎంట్రీ తో రెండు సినిమాల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చి పెట్టిన తెలుగులో ఎప్పుడు ఎంటర్ అవుతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్ళి చేసుకుని ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చిన శ్రీదేవి ఇప్పుడు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తోందని ఓ టాక్. అచ్చం తల్లి పోలికలతో ఉన్న తన కూతుర్ల ఎంట్రీ కోసం కూడా ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.