ఈయన వయసు ఆరు పదులకు అతి చేరువలో ఉన్నా ఇంకా నవ మన్మధుడే. అమ్మాయిల మనసు దోచే సోగ్గాడే... అలా అని ఆ పాత్రలకే పరిమితం కాలేదు... భక్తి పారవశ్యంలో ముంచెత్తే వాగ్గేయకారుడయ్యాడు...(అన్నమయ్య), భక్తుడైపోయాడు (శ్రీరామదాసు), దేవుడయ్యాడు (షిర్డీసాయిబాబ), అన్యాయాన్ని ఎదిరించే విప్లవకారుడు రాజన్నగా మారాడు. అటు క్లాసునూ, మాస్ నూ అన్ని వయసుల వారినీ మెప్పించే విభిన్న చిత్రల్లో నటించాడు అక్కినేని నాగార్జున. కొన్ని పాత్రల్లో చేస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందేమో నని వెనుకడుగు వేయకుండా సంచలనం సృష్టించాడు. అందుకే అందరి అభిమానాన్ని చూరగొన్నాడు అక్కినేని నాగార్జున... నటుడిగా తండ్రి నాగేశ్వర్ రావు ఇంపాక్ట్ కొంత ఉన్నప్పటికీ తన ఒరిజినాలిటీని కాపాడుకుంటూ కెరీర్ లో పైకెదిగాడు. కొన్ని పాత్రల్లో కొందరు చాలా బాగుంటారనిపిస్తుంది. నాగార్జునకు కెరీర్ మొదటి నుంచీ దాదాపు 15 ఏళ్ళ తరువాత కూడా లవర్ బాయ్ ఇమేజ్ బాగా పడిపోయింది. అలా అని అవే పాత్రల్లో నటించకుండా... అన్ని వైవిధ్యమైన పాత్రలనూ ఎంపిక చేసుకున్నాడు. ఈ విషయంలో మాత్రం నాగార్జున తండ్రి ని బాగా ఫాలో అయ్యాడనిపిస్తుంది. నాగేశ్వర్ రావు ఫామిలీ చిత్రల్లో నటించి మహిళల అభిమానాన్ని బాగా సంపాదించారు. అలా అని అవే పాత్రల్లో ఇమిడిపోకుండా డిఫరెంట్ రోల్స్ ఎంపిక చేసుకున్నారు. చక్రధారి, చాణక్య (చాణిక్య చంద్రగుప్తుడు), భక్త తుకారం, మహాకవి క్షేత్రయ్య, కాళిదాసు వంటి వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించారు. అలాగే నాగార్జున కూడా అమ్మాయిల మనసుదోచే మన్మధుడి నుంచి అన్నమయ్య, భక్తరామదాసు, శ్రీ షిర్డీ సాయిబాబ పాత్రల్లోకి దిగిపోయి సక్సెస్ అందుకున్నాడు. నటుడిగా తన కెరీర్ ను ఎంత బిల్డప్ చేసుకున్నాడో... ఎంటర్ ప్రెన్యూర్ గా నూ అదే స్థాయిలో పైకెదిగాడు.
నేడు అక్కినేని నాగార్జున 56 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకూ తన సినిమాల ఎంపికలో బిజీగా ఉన్న ఈ నటుడు ఇప్పుడు ఇద్దరు కుమారుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న పోటీకి తగినట్టుగా వాళ్ళకు మంచి సలహాలిస్తూ... పెద్ద కుమారుడు నాగచైతన్యతో పాటు ఇప్పుడు అఖిల్ ను కూడా ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య ప్రేమమ్ మళయాల రీమేక్ లో నటించ డానికి సిద్ధమవుతుండగా... అఖిల్ సినిమా చివరి దశకు వచ్చింది. ఇక నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అభిమానులకు కానుకగా శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, హంసనందిని తదితర తారగణం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది కాక కార్తీ, తమన్నతో కలిసి మరో సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్నో సక్సెస్ లు అందుకున్న నాగార్జున ఇక ముందు కూడా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆయనకు నీహార్ ఆన్ లైన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.