టాలీవుడ్‌లో అతనో సెన్సెషన్ అండ్ ట్రెండ్ సెట్టర్. మాస్ సినిమాలను తనదైన స్టయిల్లో తీయడం అతని స్పెషాలిటీ. హీరో అంటే ఎవడో కాదు నువ్వే అనే శైలిలో హీరో పాత్రను డిజైన్ చేసి, ప్రతి ప్రేక్షకుడు హీరోలో తనని తానూ చూసుకునేలా డిజైన్ చేశాడా దర్శకుడు. అతనే పూరి జగన్నాథ్. అందుకే హీరో ఎవరైనా పూరి సినిమా అంటేనే ఎలా ఉంటుందో అన్న ఎగ్జయిట్ మెంట్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. యాక్షన్‌లో కొత్తదనం.. డైలాగ్స్‌లో స్ట్రెయిట్‌నెస్ ఇలా పూరీ సినిమాలో ప్రతిది కొత్తగా ఉంటుంది. ఈ రోజు (సెప్టెంబర్ 28) పూరీ బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ హైలెట్స్ మీ కోసం.
సినిమా తీస్తే ఈ తరానికి నచ్చాలి. లేట్ చేయకుండా సినిమాను తొందరగా ఫినిష్ చేయాలి. ఈ విషయాల్లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను మించిన వారు లేరనే చెప్పాలి. అసలు హీరో అనే వాడు ఎలా ఉన్నా సరే వన్ మెన్ షో చెయ్యాలి అదే పూరీ పాలసీ. పవన్, మహేష్ లాంటి బడా హీరోలే కాదు నితిన్ లాంటి కుర్రహీరోలతో కూడా హీరోయిజాన్ని రేంజ్ లో పండించే డైరక్టర్ పూరీ. అలాంటి పూరీ ప్రస్థానంలో రాటు దేలి హిట్లు అందుకున్న హీరోలు ఎందరో...
మొదటి చిత్రం జగపతిబాబు హీరోగా వచ్చిన బాచి చిత్రం అయినప్పటికీ, తొలిసారిగా బద్రీ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. సినిమాలో కథ పెద్దగా లేకున్నా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌ను డిఫరెంట్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు పూరి జగన్నాథ్. ఇక హీరోగా రవితేజకు లైఫ్ ఇచ్చింది కూడా పూరియే. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంతో రవితేజలోని యాక్టింగ్ టాలెంట్‌ను బయటకు తీసిన పూరి.. ఇడియట్‌తో అతని స్టార్ డమ్ తెచ్చిపెట్టాడు. ఇడియట్ తరువాత పూరీ-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రవితేజ ఇమేజ్‌ను మరింత పెంచింది. ఇక నేనింతే సినిమా...హీరోగా రవితేజకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. దేశముదురులో అల్లు అర్జున్‌కు మాస్ హిట్ ఇచ్చిన పూరి.. మెగాస్టార్ నటవారసుడు రామ్‌చరణ్ ఇంట్రడక్షన్ మూవీ చిరుతకు దర్శకత్వం వహించాడు. హీరోగా రామ్‌చరణ్‌ను పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశాడు. ఇక యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తోనూ రెండు సినిమాలు చేశాడు పూరి. బుజ్జిగాడు.. ఏక్ నిరంజన్ సినిమాల్లో ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపించినా... యంగ్ రెబల్‌స్టార్‌కు ఆశించిన స్థాయిలో హిట్ ఇవ్వలేకపోయాడు.
ఇక హీరో అన్న పదానికి సరి కొత్త నిర్వచనం సృష్టించారు పూరి. అపారమైన రచనా ప్రతిభ, అద్బుతమైన సెన్సాఫ్ హ్యుమర్ ఉన్న డైరక్టర్ గా పేరుపొందాడు. 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో మహేష్ బాబు తో పోకిరి రూపంలో మరిచిపోలేని హిట్ ఇచ్చిన పూరి తన మార్కు సినిమాలతో క్రేజ్ సృష్టించారు. స్టార్ హీరోగా మహేష్ ఓ మెట్టు ఎదగటంలో పోకిరీ ఎలా ఉపయోగపడిందో మనందరికీ తెలసిందే. ఇక ఈ పోకిరీనే ఆ తర్వాత బిజినెస్ మేన్ గా మార్చాడు. తనదైన శైలిలో స్పీడ్ గా తెరకెక్కించిన ఈ మూవీ కూడా ఫ్యాన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. దేశముదురును ఇద్దరమ్మాయిలతో చూపించాడు పూరీ. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ఇద్దరమ్మాయిలతో ఆశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయినా పూరీ ఇమేజ్ ను నిలబెట్టింది. ఇక నితిన్ తో హార్ట్ ఎటాక్ తీసి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక హిట్ అనే పదానికి కొద్ది కాలంగా దూరంగా ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్ లోని టెంపర్ అనే కోణాన్ని ఆవిష్కరించి మరిచిపోలేని హిట్ ను అందించాడు.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగొందిన చక్రిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా పూరియే. బాచితో చక్రికి తొలిసారి ఆఫర్ ఇచ్చిన పూరి.. ఆ తరువాత అతనితో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేయించాడు. ఇడియట్, శివమణి, ఆంధ్రావాలా, దేశముదురు, గోలీమార్ లాంటి మ్యూజికల్ హిట్స్ అన్నీ పూరి-చక్రి కాంబినేషన్‌లో వచ్చినవే.
ప్రస్తుతం చిరంజీవి 150 వ చిత్రంపై పనిలో ఉంటూ, మెగా వారసుడు వరుణ్ తేజ్ తో లోఫర్ అనే చిత్రాన్ని కానిస్తున్నాడు. హీరో కు అసలు సిసలైన భాష్యం చెప్పిన పూరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని, మరిన్ని హిట్లు అందివ్వాలని ఆశిస్తూ నీహార్ ఆన్ లైన్ తరపున హ్యాపీ బర్త్ డే టూ పూరీ సార్.