ఒక లైలా కోసం.... అనే తాత పాటతో చిందులేసిన నాగ చైతన్య ఒక లైలాకోసం సినిమా చేశాడు బాగానే ఉంది. ఇప్పుడు తాత తండ్రుల టైటిల్ మజ్ను ను కూడా వాడేసుకుంటున్నాడు గానీ, ఈ సినిమాలో ముగ్గురు లైలాలు ఉన్నారట. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తెలుగులో మజ్ను పేరుతో రీమేక్ అవుతున్న విషయం ఇంతకు ముందే వార్తల్లో వచ్చింది. మరి మజ్ను అన్న తరువాత లైలా ఉండాలిగా... హీరోయిన్లు ఇందులో ముగ్గురు నటిస్తున్నారు. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తుండగా.. ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరు ప్రేమమ్ సినిమా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాగా మిగిలిన ఇద్దరు లైలాలు కూడా ఎంపికయ్యారు. శృతిహాసన్ తోపాటు అమైరా దస్తూర్ (అనేగన్ ఫేమ్)లు ఈ సినిమాలో చైతూతో రొమాన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే పాత తరం గడ్డం పెంచేసి శాలువా కప్పుకునే మజ్ను కాదన్న మాట... ఈ మజ్ను ఏకంగా ముగ్గురితో రొమాన్స్ చేస్తున్నాడు... రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా మరి.