తన స్వీయ అనుభవాలతో హైమారెడ్డి నటిస్తూ దర్శకత్వం వహించిన లఘు చిత్రం ‘లైఫ్ ఎగైన్'. కేన్సర్ బారిన పడిన బాధితుల్లో స్ఫూర్తినింపుతూ లఘు చిత్రం తీశారు హైమారెడ్డి. ఈ చిత్రం ట్త్రెలర్ ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ జాగృతి సమర్పణలో ఎస్.కె.ఆర్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, సీనియర్ నటి గౌతమి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ...కేన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధిని జయించడంతో పాటు బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ చిత్రాన్ని నిర్మించిన హైమారెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కేన్సర్ కేవలం రోగిని మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల్ని కూడా మానసికంగా కుంగదీస్తుంది. ‘లైఫ్ ఎగైన్’ చిత్రం క్యాన్సర్ రోగుల్లో బతకాలనే ఆశను నింపుతుందని అన్నారు. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు ప్రభుత్వం తరపున పన్ను రాయితీని ఇప్పించేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి చర్చిస్తాను అన్నారు. గౌతమి మాట్లాడుతూ రెండు రకాల కేన్సర్స్ వచ్చినా సడలని విశ్వాసంతో చికిత్స తీసుకొని సంవత్సరం తిరిగే లోపే బాహ్యజీవితంలోకి అడుగుపెట్టింది హైమారెడ్డి. నా దృష్టిలో ఇలాంటివారే నిజమైన హీరోలు. అందరిలో ఈ లైఫ్ ఎగైన్ చిత్రం స్ఫూర్తినింపుతుందని ఆశిస్తున్నాను. కవిత సహాయసహకారాలతో లైఫ్ ఎగైన్ చిత్రం ప్రతి ఒక్కరికి చేరువవ్వాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. తాను క్యాన్సర్‌ను జయించడానికి గౌతమి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నానని, ఎంపీ కవిత సహాయసహకారాలతో లఘు చిత్రాన్ని నిర్మించానని హైమారెడ్డి తెలిపారు. ఈ లఘు చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: ప్రవీణ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, దర్శకత్వం: హైమారెడ్డి.