వెయ్యి సినిమాలు పూర్తి చేసిన ఇళయ రాజాకు ‘షామితాబ్’ టీం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సినీ అతిరథ మహా మహులంతా విచ్చేసి ఆయనను ఘనంగా సత్కరించారు. డెబ్భై ఏళ్ల ఇళయరాజా సినీ సంగీత చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీశారు. సంగీతాభిమాని అయిన దర్శకుడు ఆర్. బల్కికి గతంలో ‘చీనీ కవ్’, ‘పా’, తాజాగా ‘షమితాబ్’ చిత్రాలకు సంగీతమిచ్చారు ఇళయరాజా. ఈ సన్మాన సభలో ఇళయ రాజా మాట్లాడుతూ, ‘‘బల్కి నాకు వీరాభిమాని. నా పాటలన్నీ ఆయనకు బాగా తెలుసు. అయితే, అచ్చంగా నా పాత హిట్ పాటల లాంటివే కావాలని అడగడం మాత్రం నచ్చదు’’ అని నవ్వేశారు తనను తాను రిపీట్ చేసుకోవడం కూడా ఇష్టపడని ఇళయరాజా. ‘‘అమితాబ్ చాలా అద్భుతమైన వ్యక్తి. మంచి గాయకుడు కూడా. గతంలో ఆయన పాడినవి బల్కి నాకు వినిపించారు. శ్రుతి మీద మంచి పట్టున్న అమితాబ్ కోసం ‘షమితాబ్’లో పాట చేసి, ఆయన శ్రుతికి తగ్గట్లుగా మార్చి, పాడించా. ఆయన చాలా బాగా పాడారు’’ అని రాజా చెప్పుకొచ్చారు. కమలహాసన్ గురించి చెపుతూ ‘‘ఆయన చాలా మంచి గాయకుడు. అతనిది బ్రహ్మాండమైన గొంతు. సంగీతంలోనూ, నటనలోనూ ఆయన గ్రహణశక్తి కూడా అద్భుతం. అప్పటి దాకా జోకులు వేస్తూ ఉండే కమల్, దర్శకుడు యాక్షన్ చెప్పగానే పూర్తిగా ఆ పాత్రలోకి మారిపోయి అపూర్వంగా నటిస్తాడు’’ అని ఇళయరాజా తన అనుభవాన్ని వివరించారు. ఇక రజనీ గురించి మాట్లాడుతూ ‘‘రజనీ మంచి దర్శకుడు. అద్భుతమైన స్క్రీన్ప్లే రచయిత. ఆ మాటే ఆయనతో అంటూ, మీ సినిమాలకు మీరే ఎందుకు రాయకూడదంటే, ఆ పని భిన్నమైనది స్వామీ అంటూ నవ్వేశాడు’’ అని ఈ సంగీత జ్ఞాని సినీ మహా మహుల గురించి తన అభిమతాన్ని వెల్లడించారు. అమితాబ్ నటిస్తున్న ‘షమితాబ్’కు ఆయన పూర్తిగా కొత్త బాణీలే అందించారు.