డైలాగ్ చెప్పాడా... డాన్స్ చేశాడా... ఫైట్స్ చేశాడా అన్నది అనవసరం. అతడు తెరపై కదిలితే చాలు హీరోయిన్ గుండెల్లోనే కాదు, కోట్లాది అమ్మాయిల గుండెల్లో కూడా ప్రేమ బాణాలు గుచ్చుకునేవి. వారిలో ఆరాధన భావం పెంచాడు. ఆయనే రాజేష్ ఖన్నా. ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్. కొన్ని ఏళ్ల పాటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆయన రొమాంటిక్ గాలే.
1942 డిసెంబర్ 29 న జన్మించిన అమృత్ సర్ రాజేశ్ ఖన్నా అసలు పేరు జతిన్. నటనపై ఆసక్తితో స్టూడియోల చుట్టు తిరిగేవాడు. అవకాశాల కోసం ఎన్జీ స్పోర్ట్స్ కారులో తిరిగే ఆయన్ను చూసి అంతా అసూయ పడేవారంట. మూడేళ్లలో 15 బ్లాక్ బస్టర్లు. ఇప్పటిదాకా ఏ హీరోకి సాధ్యం కానీ ఫీట్ అది. అదే ఆయనను సూపర్ స్టార్ ని చేసింది. 1969లో ఆరాధన అనే సినిమాతో ఓ ట్రెండ్ సృష్టించారు. అది అసలు అంచనాలు లేకుండా వచ్చింది. రూప్ తెరా మస్తానా అంటూ షర్మిలా ఠాగూర్ తో రాజేశ్ చేసిన రొమాన్స్ ఇప్పటికీ కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. ఆరాధన, బంధన్, సఫర్, ఆనంద్, చోటీ బాహు ఇలా అన్ని క్లాసిక్ హిట్లే. స్టార్ డమ్ తెచ్చిపెట్టిన అహంకారం, నిర్లక్యం ఆ తర్వాత రాజేశ్ ఖన్నా కెరీర్ పై ప్రభావం చూపించాయి. డింపుల్ కపాడియాతో పెళ్ళి పెటాకులు కావడంతో రాజేశ్ కెరీర్ కూడా మసకబారింది.. 1991లో ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్ సభ కు పోటీ చేసి గెలిచారు. అయితే డింపుల్ తో ఎడబాటు వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తే, సినిమాలు లేకపోవడం మానసికంగా దెబ్బతీసింది. ఆ రకంగా ఈ సూపర్ స్టార్ జీవిత చరమాంకలో ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. జూలై 18 2012 లో ఆయన తుది శ్వాస విడిచారు. కానీ, ఆయన అందించిన చిత్రాలతో ముఖ్యంగా మ్యూజికల్ హిట్స్ తో ఆయనకు ఇండియన్ ఫిల్మ్ ఫేస్ గా గౌరవం అందించారు.