ప్రభాస్ ను చూస్తే కాస్త గంభీరంగా కనిపిస్తారు కానీ... ఇంత ప్రాక్టికల్ జోక్ చేయగలరా అనిపిస్తుంది.... అలాంటిదే జరిగిందంటూ కమెడియన్ వేణు చెప్పుకొచ్చాడు. తను మున్నా సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగిందట. ‘‘ప్రభాస్‌గారు హీరోగా నటించిన ‘మున్నా' షూటింగ్ లో రాత్రి దాదాపు 2 గంటల సమయంలో హైదరాబాద్ టోలీచౌక్ దగ్గరున్న డాక్ బంగ్లా టెర్రస్ పైన షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో నేను ప్రభాస్‌గారికి ఫ్రెండ్‌గా నటించాను అందులో. ఆయన్ని ఉద్ధేశించి ‘‘రేయ్ .. పర్సనల్ లైఫ్ అంటే ఏమిటో తెలియకుండా పెరిగాం. మా కోసం నువ్వూ, నీకోసం మేమూ కలిసి బతికాం - కలిసే బతుకుతాం'' అనే డైలాగ్‌ను సీరియస్‌గా చెప్పాలి. షాట్ రెడీ అయ్యింది. నేను డైలాగ్ చెప్పబోతుండగా జేబులోంచి ‘రింగ్'టోన్! రాత్రి రెండు గంటలకు ఫోనేంటా అని భయపడిపోయాను. డైలాగ్ చెప్పబోతున్న ప్రతిసారీ ఫోన్ రింగయ్యేది. ఆగిపోయేది. దాదాపు పది టేకులు తిన్నాను. ఒకవైపు నిద్రమత్తు. మరోవైపు డైలాగ్ చెప్పాలి. ఫోన్ పక్కన పెడదామన్న ఆలోచన కూడా రాలేదు. పైగా కెమెరా ఫ్రేమ్‌లో నేనొక్కడినే కనిపించే సన్నివేశం అది. డైరెక్టర్ వంశీపైడిపల్లి గారు చిరాకు పడిపోయి అరవబోయేలోపు ప్రభాస్‌గారు గబగబ వచ్చి ‘‘నేనే సరదాగా మిస్డ్ కాల్స్ ఇచ్చాను'' అనేసరికి సీరియస్‌గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ పగలబడి నవ్వారు. షూటింగ్ లో ఇలాంటివి అప్పటికి విసుగనిపిస్తాయేమో గానీ తరువాత గుర్తు చేసుకుంటే చాలా నవ్వు తెప్పిస్తాయి, జీవిత కాలం మనని అప్పుడప్పుడూ రిజివినేట్ చేస్తుంటాయి అన్నారు వేణు.