ఖడ్గం, ఆంధ్రావాలా తదితర చిత్రాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న పావల శ్యామల ప్రస్తుతం కష్టాల కడగండ్లలో ఎదురీతున్నారు. ఆర్ధిక పరిస్ధితి బాగలేక తనకు వచ్చిన అవార్డ్స్ ను అమ్ముకుంటూ కాలం గడుపుతున్నారు. గతంలో కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడిన సమయంలో ఎందరో సినీ పెద్దలను కలిసిన తనకు ఫలితం దక్క లేదని , కానీ, ఆ సమయంలోనే పవన్ లక్ష రూపాయలు ఇచ్చి తనకు అండగా నిలిచినట్టు తెలిపారు.
ఇక ఇప్పుడు కనీసం కుటుంబ పోషణకు డబ్బులేక ఆత్మహత్య చేసుకునేందుకు కూడా సిద్దమయ్యారు. సీనియర్ నటుడు రంగనాథ్ లా తనకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందని, ఆర్థిక స్థోమత లేని తనను ఆదుకోవాలని ఆమె దాతలకు పిలుపునిచ్చారు.
ఇక ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. పావలా శ్యామలను ఆర్థికంగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో సీఎం క్యాంపు ఆఫీసులో కేసీఆర్ ను ఆమె కలిసింది. ఆమె వెంట కూతురు మాధవి కూడా ఉంది. తక్షణ ఆర్థిక సాయం కింద రూ.20 వేలు శ్యామలకు అందజేశారు. ఇంటి అద్దె కట్టేందుకు కూడా ఇబ్బంది పడుతున్న శ్యామలకు డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున ఆమెకు ప్రతి నెల రూ.10 వేలు చొప్పున పింఛన్ ఇవ్వాలని ఆదేశించారు.
ఇక ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించి, తన వంతు సాయంగా రూ.20 వేల రూపాయలను ఆమెకు అందించారు. అంతేకాక ప్రతి నెల తన బ్యాంక్ ఎకౌంట్ నెంబర్‌లో రూ. 5 వేల రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.