ఇప్పటి వరకూ ఎన్నో బాలారీష్టాను ఎదుర్కొన్న గుణ శేఖర్ కు ఇక మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి. ఈ సినిమా గురించి అన్ని ప్రతికలూ, చానళ్ళు, వెబ్ సైట్లు కూడా పాజిటివ్ గా స్పందించడంతో పాటు ఇప్పుడు ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు. ‘రుద్రమదేవి’ సినిమా తీసి ఎంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు గుణ శేఖర్. ఎన్నో సార్లు విడుదల అనుకోవడం... వాయిదా పడడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి క్రేజ్ రావడమే కాదు, తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి ఒప్పుకుంది. ఇంకొక్క రోజులో సినిమా విడుదలవుతుండగా గుణశేఖర్ ఈ తీపి కబురు అందుకున్నాడు.
గురువారం గుణశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తెలంగాణ చరిత్రకు గర్వకారణమైన రుద్రమదేవి కథతో తెరకెక్కిన సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరాడు. తానీ సినిమా కోసం ఎంత కష్టపడింది వివరించారు. కేసీఆర్ గుణశేఖర్ విజ్నప్తిని మన్నించి వెంటనే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. రుద్రమదేవి కథతో సినిమా తీసినందుకు గుణశేఖర్ ను అభినందించడంతో పాటు, తానీ సినిమా చూస్తానని చెప్పాడట. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ‘రుద్రమదేవి’. ఐతే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి ఇంత బడ్జెట్టా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెట్టుబడి తిరిగొస్తుందా లేదా అనుమానాలున్నాయి. ఐతే పన్ను మినహాయింపు వల్ల గుణశేఖర్ కు చాలా మేలు జరుగుతుంది.