లేడీ ఓరియెంటల్ చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కంగనా రనౌత్. బక్కపల్చటి దేహంతో జీరో సైజ్ లో గ్లామర్ పరంగా అంత ఆకట్టుకోనప్పటికీ నటనాపరంగా అక్కడ ఆమెను కొట్టేవారే లేరు. అలాంటి కంగనా ఈ మధ్య తన కుటుంబంపై షాకింగ్ కామెంట్లు చేసింది. తన తల్లిదండ్రులు 'కోరుకోని బిడ్డ'గా తాను జన్మించానని ఆమె బాంబ్ పేల్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
దీంతో ఆమె తండ్రి అమర్ దీప్ రౌనత్ కంగనా కామెంట్లపై స్పందించారు. "ఆమె పుట్టిన సమయంలో మా గ్రామంలో పరిస్థితి అలాంటిది. ఆడపిల్ల పుట్టిందంటే సంబరాలు చేసుకునే స్థితి లేదు. ఆడపిల్ల జన్మ అంటే చావు కన్నా పెద్ద బాధ కిందే లెక్క. ఊళ్లో వాళ్లంతా వచ్చి ఆడపిల్లా? అని పెదవి విరిచి వెళ్లేవారు. అందుకే బిడ్డ పుట్టిందన్న ఆనందం లేదు. మేమేమీ మిఠాయిలు పంచుకోలేదు. అప్పటికే మాకు ఓ మగబిడ్డ పుట్టి చనిపోయాడు. ఆనాటి మా పరిస్థితి అటువంటిది" అని తెలిపాడు. కాగా, ఇదే విషయమై ఆమె సోదరి రంగోలీ మాట్లాడుతూ, "కంగనా పుట్టిన రోజు నాకింకా గుర్తుంది. ఆనందం లేదు, ఉత్సాహం లేదు. బంధువులు ఇంటికి వచ్చి బిడ్డ అక్కర్లేదని కూడా అన్నారు. మేం పుట్టిన ఊరు ఇప్పటికీ మారలేదు. బాలికల పట్ల అక్కడ ఇంకా ఇదే స్థితి. కంగనా పెరుగుతున్న కొద్దీ, తన మనసులో బాలికలపై చూపుతున్న వివక్ష ప్రభావం బలంగా నాటుకుపోయింది" అని చెప్పింది.