మా నాన్నకు పెళ్ళి చిత్రంతో తాగుబోతు క్యారెక్టర్ లో బాగా క్లిక్కయ్యాడు ఎంఎస్. అంతకు ముందు ఓ సినిమాలో నటించినప్పటికీ రెండవ సినిమాకు వచ్చిన గుర్తుంపుతో ఇక ఆయనకు తిరుగులేదనిపించుకున్నాడు. ఎక్కువ సినిమాల్లో తాగుబోతుగా నటించి కామెడీతో మాంచి కిక్కిచ్చారాయన. అప్పటివరకూ తెలియని ముఖం ఆ సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీ అందించే సరికి ఎవరితను? అనుకున్నారందరూ అప్పట్లో. అప్పటికే ఆయన కొన్ని సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఈయనను నటనకు ప్రోత్సహించింది మాత్రం రవి రాజా పినిశెట్టి. ముఖం సీరియస్ గానే ఉంటుంది మాటల్లో మాత్రం పంచ్ లు పడుతుంటాయి. ఆయనలో ఇది నచ్చే కాబోలు రవి రాజా పినిశెట్టి ఈ సలహా ఇచ్చినట్టున్నారు. ఇక ఓ దశలో ఆయనకు పేరడీలిచ్చి తెరపై నవ్వులు పూయించారు డైరెక్టర్లు. ఆ మధ్య వచ్చిన ‘దూకుడు’ సినిమాకు ఆయన కామెడీ చూసిన తెలుగు ప్రేక్షకులు ఆయనను జీవితకాలం గుర్తుంచుకుంటారు. ‘దుబాయ్ శీను’ చిత్రంలో ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గా, ‘కబడ్డీ కబడ్డీ’లో తాగుబోతు హాకీ కోచ్ గా, ‘ఒట్టేసి చెపుతున్నా’ చిత్రంలో రెడ్డి నాయుడు పాత్రలో, ‘నువ్వునాకు నచ్చావ్’ చిత్రంలో పేకాట బాబాయ్ గా, ‘వీడు తేడా’ చిత్రంలో నాటకాల రాయుడిగా అగ్ర హీరోలందరినీ ఇమిటేట్ చేస్తాడు. ఇలా ఏ పాత్రలో నైనా కామెడీ పండించడం ఆయనకు ఆయనే సాటి. అందరు హీరోల ఎమోషనల్ డైలాగులు ఆయన చేత చెప్పించడం నిజంగా కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే ఆ సీన్లు చూసి. ఈయనతో ఢిల్లీ మాజీ సి.ఎం. కేజ్రీవాల్ క్యారెక్టర్ తో కామెడీ పండించేందుకు ‘క్రేజీవాలా’ అనే సినిమాను కూడా నిర్మించారు. ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆయన తెరమీదకు వచ్చాడంటే చాలా అందరి మోముల్లో నవ్వులు విరబూయాల్సిందే. అంతలా ఒదిగిపోయారు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ పాత్రల్లో నటించి మెప్పించిన ఎం.స్ ఇక లేరు అనే విషయం సినీ అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఆయన హఠాన్మరణానికి ‘నీహార్ ఆన్ లైన్.కామ్’ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.