ప్రముఖ హాస్య నటుడు ఎం.ఎస్.నారాయణ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం భీమవరంలోని హోటల్ లో అస్వస్థతకు గురైన ఆయనను హైదరాబాద్ కోండాపూర్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ఆయన చనిపోయాడనే వార్త వచ్చినప్పుడు, ఆయన కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని ఖండించారు. కానీ, పరిస్థితి విషమంగా ఉందని మాత్రం వైద్యులు తెలిపారు. ఆయన భార్య కళాప్రపూర్ణ, పిల్లలు శశికిరణ్, విక్రమ్(నటుడు) ఉన్నారు. 1951 ఏప్రిల్ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడదమర్రు లో జన్మించిన ఆయన అసలు పేరు మైలవరపు సూర్యనారాయణ. సుమారు 700కు పైగా చిత్రాల్లో నటించిన ఎమ్మెస్ ప్రతిష్టాత్మక నంది అవార్డును అయిదుసార్లు అందుకున్నారు. ఎం.ధర్మరాజు ఎం.ఏ. ఆయన తొలిచిత్రం. చాలా చిత్రాలకు ఆయన రచయితగా కూడా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎమ్మెస్ లెక్చరర్‌గా జీవితం ప్రారంభించి సినిమాలపై మక్కువతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఎమ్మెస్ నటించిన పటాస్, రేయ్, శంకర సినిమాలు, ముఖ్యపాత్రలో నటించిన నవాబ్ భాష, శుభోదయం, క్రేజీవాలా తదితర చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మానాన్నకు పెళ్లి, రామ సక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు చిత్రాలకు గానూ ఉత్తమ హస్యనటుడిగా ఎమ్మెస్ నంది అవార్డులందుకున్నాడు.