తెలుగు వినోద రంగంలో బుధవారం ఓ కీలకాంశం చోటుచేసుకుంది. తెలుగు టీవీ ప్రేక్షకుల ఆదరాభిమానాలను చురగొంటున్న మాటీవీ ఇకపై స్టార్ టీవీ యాజమాన్యం కింద కార్యకలాపాలు సాగించనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు మా టీవీ లో వాటాదారుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తెలిపారు. రూపర్ట్ మర్డోక్ (స్టార్ చైర్మన్) ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరగిందని, అయితే ఎంత వాటా కొనుగొలు జరిగిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేనని ఆయన చెప్పారు. అయితే బ్రాడ్ కాస్ట్ బిజినెస్ లో భాగస్వాములం మాత్రమేనని, కంపెనీ యాజమాన్యం , ప్రమోటర్లు వాళ్లే ఉంటారని స్టార్ తరపున ప్రతినిధి ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమ కార్యక్రమాలు అందించేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిమ్మగడ్డ ప్రసాద్ తోపాటు టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ లకు మాటీవీ లో వాటాలున్న సంగతి అందరికీ తెలిసిందే.