బాహుబలి అనే ఒక్క సినిమాతో ప్రపంచం దృష్టిని తనవైపు మళ్లీంచుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇండియన్ చిత్రాల్లో ఇప్పటిదాకా ఏ చిత్రానికి రాని క్రేజ్ ను బాహుబలితో సంపాదించి పెట్టాడాయన. ఇక అదే ఊపుతో త్వరలో బాహుబలి ది కంక్లూజన్ కి సిద్ధమైపోతున్నాడు. అన్ని భాషల్లో ప్రాధాన్యం ఉన్న నటులను, టెక్నిషియన్లను వాడుకోవటం ద్వారా అందరి దృష్టి ఆకర్షించాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నాడట. ఇందుకోసం పలువురి నటీనటులను సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే షూటింగ్ కూడా ఇంకా మొదలవ్వక ముందే సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నటించే ఆర్టిస్టుల విషయంలో రోజుకోపేరు తెరమీదకు వస్తోంది.
తాజాగా హాలీవుడ్ నటుడు నాథన్ జోన్స్ పేరు కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ స్టార్ నటుడు బ్లాక్ బస్టర్ చిత్రాలైన 'ట్రాయ్', 'మ్యాడ్ మాక్స్ ప్యూరి రోడ్' లలో నటించాడు. ఇక ఆమధ్య తమిళంలో జయంరవి హీరోగా వచ్చిన 'భూలోగం' అనే సినిమాలో విలన్ గా నటించాడు. ఇప్పుడిక 'బాహుబలి-2'లో ఓ కీలక పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. మరి, ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది జక్కన్న చెబితేనే బావుంటుంది.