టాలీవుడ్ తొలినాళ్లలోనే ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోతో చిత్రాలు తెరకెక్కించి తక్కువ టైంలో ఎక్కువ పేరు, లాభాలు అర్జించాడు నిర్మాత అశ్వినీదత్. ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్ తో పేరుతో మూడు దశాబ్దాలు ఆయనదే హవా. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర లాంటి భారీ హిట్లతో దూసుకెళ్లారు. కానీ, మధ్యలో, ఆ తర్వాత కూడా ఎంత పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారో, అంతే అట్లర్ ఫ్లాపులు వచ్చిపడ్డాయి. చివరగా శక్తి(2011) అంటూ ఎన్టీఆర్ తో ఓ డిజాస్టర్ మూవీ తీశారయన. అయితే నిర్మాతగా ఆయన విఫలమవుతున్నప్పటికీ చిన్న చితకా సినిమాలతో ఆయన కుమార్తెలు మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఐదేళ్లుగా చిత్రాలకు దూరంగా ఉన్న ఈ అగ్ర నిర్మాత తిరిగి ఓ భారీ ప్రాజెక్టుతో ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు.
త్వరలో మహేష్ బాబుతో ఓ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు ఆయన సిద్ధమౌతున్నాడట. అది కూడా టాప్ డైరక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో. నిజానికి ఈ కాంబినేషన్లో చిత్రం రెండేళ్ల క్రితమే రావాల్సింది. కానీ, ఎందుకో అది కుదర్లేదు. ఇక ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అశ్వినీ దత్ తెలియజేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ఈ యేడాది క్రేజీ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమౌతుందని కన్ఫర్మ్ చేశాడు.
ప్రస్తుతం బ్రహోత్సవం ముగింపుదశకు చేరుకుంది. మురగదాస్ చిత్రం ఏప్రిల్ లో ప్రారంభం కానుంది. అది త్వరగా పూర్తి చేసి ఈ దీపావళికే విడుదల చేయాలని మహేష్ భావిస్తున్నాడు. ఆపై గౌతమ్ మీనన్ చిత్రం షూటింగ్ ప్రారంభ కావొచ్చని టాక్. అయితే ఎట్టి పరిస్థితుల్లో 2017 సమ్మర్ లో మహేష్-గౌతమ్ సినిమా విడుదల అవుతుందని అశ్వినీ దత్ చెబుతున్నాడు. మిగతా వివరాలన్నీ గోప్యం అంటున్నారయన. హీరోగా మహేష్ డెబ్యూ మూవీ రాజకుమారుడు ఆయన నిర్మించిందే. ఇక సైనికుడు కూడా వైజయంతి మూవీస్ లోనే వచ్చింది. మరీ రెండు డిజాస్టర్ లు ఇచ్చిన మహేష్ మూడోసారి ఏం చేస్తాడో చూద్దాం.