మురళీమోహన్ పై సగం నెగ్గిన సురేష్ బాబు

April 12, 2016 | 11:48 AM | 2 Views
ప్రింట్ కామెంట్
highcourt-relief-to-producer-Suresh-Babu-niharonline

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబుకు పెద్ద ఊరట లభించింది. ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గత కొద్దికాలంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టకుండా ఉన్నారు. సిటీ సివిల్ కోర్టు ఆయనపై జారీ చేసిన ఉత్తర్వులతో ఈ పరిస్థితి నెలకొంది. సురేశ్ బాబు ఫిలిం చాంబర్ కు బకాయి పడ్డారని, అలాంటి వ్యక్తి చాంబర్ ఎన్నికల్లో పోటీ చేయడానికే అనర్హుడని డిస్ట్రిబ్యూటర్ మురళీమోహన్(నటుడు కాదు) గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. నిబంధనలను తోసిరాజని ఎన్నికల్లో దిగిన సురేశ్ బాబు ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మురళీమోహన్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు.

                            నిబంధనలను అతిక్రమించిన సురేశ్ బాబు చాంబర్ అధ్యక్ష పదవి బాధ్యతలు నిర్వర్తించకుండా నిరోధించాలని మురళీమోహన్ కోర్టును కోరారు. దీనిపై వాదోపవాదాలు విన్న సిటీ సివిల్ కోర్టు, పిటిషనర్ వాదనతో ఏకీభవించి చాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించరాదని సురేశ్ బాబును ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సురేశ్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న జస్టిస్ చంద్రయ్య ఇరువర్గాల వాదనలు విన్నారు. చాంబర్ కు సురేశ్ బాబు ఎలాంటి అప్పులు లేరని, నిబంధనల మేరకు ఎన్నికైన వ్యక్తిని బాధ్యతలు నిర్వర్తించకుండా అడ్డుకోవడం సరికాదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు సిటీ సివిల్ కోర్టు జారీ చేసిన తీర్పుపై స్టే విధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ