పూనమ్‌పాండే, మిలన్ ప్రధాన తారాగణంగా మనీషా ఆర్ట్స్ మీడియా ప్రై. లి. పతాకంపై వీరు.కె. దర్శకత్వంలో మహేష్ రాఠి రూపొందించిన ‘మాలినీ అండ్ కో’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెల 14న విడుదల చేయాలని నిర్ణయించినా అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్‌రాఠి, మహేష్‌రాఠి మాట్లాడుతూ, తమిళంలో ‘మిథాలి అండ్ కో’గాను, మలయాళంలో ‘మిన్నత్ మైథిలి’గానూ తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాషల్లోనూ ఈనెల 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేశామని, అయితే తమిళ వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు ఆలస్యం అవుతుండడంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నామని తెలిపారు. హిందీ, భోజ్‌పురి, మరాఠి, గుజరాతి, బెంగాల్, ఒరియా భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామని, చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వారు తెలిపారు. తీవ్రవాద నేపథ్యంలో యాక్షన్ రొమాంటిక్ జోనర్‌లో సాగే ఈ చిత్రంలో నటీనటులు అద్భుతంగా నటించారని, కథకనుగుణంగా పాటలు ఉంటాయని చిత్ర దర్శకుడు వీరు తెలిపారు. ఇటీవల విడుదలైన పాటలకు, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. సామ్రాట్, సుమన్, జాకీర్, రవి కాలె, జీవా, ఖుషి ఫరా, కావ్య, సాంబ, చిత్రం భాషా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, డాన్స్:ప్రేమ్ రక్షిత్, తార, వినయ్, నిర్మాత:మహేష్ రాఠి, సంగీతం, దర్శకత్వం:వీరు.కె.