తానా 20వ మహాసభల్లో భాగంగా మణి శర్మ ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ పాటల పండుగలో గాయనీగాయకులు శ్రీరామ్, చిత్ర, ఉష, తదితరులు తమ పాటలతో ప్రేక్షకులను ఆనందడోలికల్లో ముంచారు. యువసింగర్ శ్రీకృష్ణ యాంకర్ గా వ్యవహరించారు. ఈ మహాసభలో సినీ నటులు నవదీప్, నిఖిల్‌లు లు కూడా హాజరై మన తెలుగువారిని మరింత ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ తానా మహాసభలు చాలా బాగున్నాయని, తనకు బాగా నచ్చాయన్నారు. ఇక్కడి తెలుగువారు తమపై ఎక్కువ అభిమానం చూపిస్తున్నారని ఆయన అన్నారు. మరో యంగ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ ఈ రెండు రోజుల్లో కనీసం 500 నుంచి 600 మంది పిల్లలతో సెల్ఫీలు దిగానని పేర్కొన్నారు. చిన్నప్పుడు తాను కూడా వెంకటేష్‌తో కలిసి ఫోటో దిగానని అది చూసినప్పుడు తనకెంతో సంతోషంగా ఉంటుందని ఆయన చెప్పారు. మరో ప్రక్క వెంకీ చేతుల మీదుగా... తెలుగు భాషకు కృషి చేస్తున్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు 'తానా ఎన్టీఆర్ అవార్డు'ను వెంకటేష్ చేతుల మీదుగా అందజేశారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ,'తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, తెలుగు ఆచార వ్యవహారాలను, తెలుగు జీవన విధానాలను సముద్రాలు దాటినా కూడా పాటిస్తున్న అమెరికాలోని తెలుగువారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న 'తానా'కు ధన్యవాదాలు. దీంతోపాటు ఈ అవార్డును విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా అందుకోవడం మరింత సంతోషంగా ఉంది' అని అన్నారు. 'నందమూరి రామాయణం.. నందమూరి పారాయణం..' అంటూ ఎన్టీఆర్ జీవితకథను ప్రతిబింబించేలా పద్యాన్ని పాడి సుద్దాల అశోక్ తేజ అందరినీ అలరించారు.