తెలుగు ఇండస్ట్రీకి కొత్త నాయికలు పరిచయం కావటం, ఒకటి రెండు సినిమాలు చేయటం, ఆపై అటకెక్కేయటం కామన్ గా మారిపోయింది. అయితే వచ్చిన వాళ్లలో కొందరు మాత్రమే మన పక్కింటి అమ్మాయిల్లా కనిపిస్తూ తమ నటనతో మన మనసును తాకుతారు. అలాంటి వారిని తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా వదులుకోరు. సరిగ్గా మెహ్రీన్ కౌర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. అల్రెడీ కొన్ని పంజాబీ చిత్రాల్లో నటించి ఆపై నాని కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. చక్కగా లంగావోణీల్లో తెలుగింటి అమ్మాయిలా నేచురల్ స్టార్ పక్కన మహాలక్ష్మీగా జీవించేసింది. ఆపై తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్టులలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కల్యాణ్ రామ్-పూరీ సినిమాలోను, రచయిత బీవీఎస్ రవి-సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలోను మెహ్రీన్ హీరోయిన్.
కానీ, అనుకోని ఓ బంఫర్ ఆఫర్ ఇప్పుడీ అమ్మడికి తగిలింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హీరోయిన్ అనుష్క శర్మ సొంత బ్యానర్ స్థాపించి చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అల్రెడీ ఎన్ హెచ్ 10 అనే చిత్రంతో హిట్ కూడా సాధించింది. ఇక ఇప్పుడు మరో చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైపోతుంది. అయితే సినిమా కోసం పంజాబీ కథానాయికను అన్వేషిస్తోన్న వాళ్లకి మెహ్రీన్ గురించి తెలిసిందట. దీంతో ఆమెను సంప్రదించి వెంటనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎంత ట్రై చేస్తున్న బాలీవుడ్ లో ఆఫర్లు రాని హీరోయిన్లు ఈ సంగతి తెలిసి షాక్ తిన్నారంట. నాని సినిమా ఈ అమ్మడి కెరీర్ ను ఇంతగా టర్న్ చేస్తుందని బహుశా మెహ్రీన్ కూడా ఊహించి ఉండదు కదా!