తమ ఫేవరెట్ హీరోగానీ, హీరోయిన్ గానీ ఫోన్ నంబర్ లు దొరికితే ఎవరైనా ఊరుకుంటారా? అస్తమానం ఫోన్ లు, మెసేజ్ లు చేసి విసిగిస్తూ ఆనందిస్తుంటారు. అభిమానం వెర్రితలలు వేసిన ఫ్యాన్స్ అయితే కాస్త శృతి మించుతారు కూడా. అలా ఓ హీరోయిన్ గారి వెబ్ సైట్లో దర్శనమిచ్చిన ఫోన్ నంబర్ తో ఏకంగా ఓ మంత్రిగారు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మరాఠి హీరోయిన్ రింకూ రాజ్ గురు ‘సాయిరత్’లో ఆమె నటనకు గాను దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. మరాఠీ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను నెలకొల్పింది.
ఇక ఈవిడగారి వెబ్ సైట్ పడ్డ హ్యాకర్లు అందులో మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ ఫోన్ నంబర్ ను ఉంచారు. దీంతో, రింకూ అభిమానుల నుంచి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ రావటంతో ఏం చేయాలో పాలుపోక చివరకు దేశాయ్ ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. రింకూ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వాళ్లు తన ఫోన్ నంబర్ ను అందులో ఉంచి తమ తెలివితేటలను ప్రదర్శించారని, ఈ సంఘటనలో రింకూ ప్రమేయమేమి లేదని మంత్రి ఓ స్టేట్ మెంట్ ఇచ్చుకున్నారు. ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూస్తే చాలా మిస్డ్ కాల్స్ తో పాటు మెస్సేజ్ లు ఉన్నాయని, అందులో కొన్ని అసభ్యకరరీతిలో కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. మొత్తానికి హీరోయిన్ అభిమానులు ఆ మంత్రిని కాసేపు కంగారు పెట్టారన్న మాట.