బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అంటూనే సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా మొదటి పార్ట్ కోసం ఎంత జాగ్రత్త తీసుకున్నాడో, రెండో పార్ట్ కోసం అంతకు మించి బందోబస్తు ఏర్పాటు చేశాడు జక్కన్న. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో ఉంది ఆ టీం. అయిపోగానే జూన్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేస్తారు. అయితే రెండో పార్ట్ లో స్టార్లు ఉంటారంటూ వస్తున్న వదంతులపై రాజమౌళి సింపుల్ గా లేదని ఒక్క మాటతో తేల్చేశాడు. ఒకటి రెండు పాత్రలు తప్ప మిగతాదంతా పాత నటీనటులతోనే కానిచ్చేస్తున్నాడన్నది తెలియవస్తున్న వార్త. ఇక ఇందులో కీలకమైన ఓ పాత్ర గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది.
కథ ప్రకారం సినిమాలో భల్లాలదేవుడికి ఓ భార్య ఉండాలి. ఈ పాత్ర కోసం లావణ్య త్రిపాఠి, శ్రీయా అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ, విశ్వసనీయ వర్గ సమచారం ప్రకారం ఆ పాత్ర అల్రెడీ మొదటిపార్ట్ లోనే నటించిన నటితోనే చేయిస్తున్నారంట. ఎవరో అనుకుంటున్నారా? చిత్రంలో యుద్ధ సన్నివేశంను జాగ్రత్తగా పరిశీలిస్తే... రమ్యకృష్ణ వెనకాల ఓ నటి ఉంటుంది. ఆమె పేరు భాను శ్రీ. ఈ ముద్దుగుమ్మ పలు తెలుగు సీరియల్స్ లో నటించడమే కాదు, ఈ మధ్య ఒకటి రెండు తెలుగు చిత్రాల్లో కూడా తళుక్కు మెరిసింది. కథ రీత్యా రెండో పార్ట్ లో అనుష్క, ప్రభాస్ పెళ్లి జరగ్గానే, కోపంతో భల్లాలుడు తన సైన్యంలోని ఆమెను వివాహం చేసుకుంటాడని, అలా వారికి కలిగిన సంతానమే భద్ర (అడవిశేష్) అని ఓ కథనం వెలువడుతోంది. ఈ వార్త నిజమో కాదో తెలీదు కానీ ప్రస్తుతానికైతే భల్లాలుడి భార్య అంటూ భాను పై వార్తలు మాత్రం గుప్పుమంటున్నాయి.