మన తెలుగు సినిమా వాళ్ళేమో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చెయ్యలేక కిందా మీదా పడుతుంటే... పొరుగు రాష్ట్రం వారు విడుదల చేస్తున్న సినిమాకు అక్కడి కంటే ఎక్కువ థియేటర్లు ఇవ్వడం ఎంత విడ్డూరం. తమిళనాడులో ‘పులి’ సినిమా 700 థియేటర్లలో విడుదలవుతుంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 800 థియేటర్లలో విడుదల చేస్తున్నారట. తమిళనాట మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్. అలాంటిది ఆయన సినిమా అక్కడ 700 థియేటర్లలో మాత్రమే విడుదలవుతోంది. మరి శ్రీదేవి ప్రభావమనుకోవాలా? లేక హన్సిక, శృతి హాసన్ ల ప్రభావమనుకోవాలా? తెలుగులో ఈ సినిమా దాదాపు 800 థియేటర్లలో విడుదల చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి కన్నా మన దగ్గర థియేటర్లు ఎక్కువగా ఉన్నా సరే రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కూడా అక్కడి కంటే ఇక్కడ ఎక్కువ రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ‘పులి’ సినిమాను దాదాపు 3500 థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయ్ సినిమా తొలిసారిగా హిందీలోనూ విడుదల చేస్తున్నారు. హిందీలో దాదాపుగా 1500 థియేటర్లలో విడుదలవుతోందట. కేరళలో, కర్ణాటకలో కూడా పులి సందడి చేయబోతోంది. ఓవర్సీస్ లోనూ విజయ్ కూడా ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు. అత్యంత భారీ ఎత్తున విడుదల చేస్తున్న ఈ సినిమా భవితవ్యం మరి మూడు రోజుల్లో తేలనుంది.