ఏ రంగానికైనా టాలెంట్ చాలా అవసరం... కానీ సినిమా రంగానికి టాలెంట్ తో పాటు అందం... ఒడ్డూ...పొడవు ఉండాలి... కానీ అవేమీ లేకుండా కూడా చొచ్చుకొస్తున్నారు ఈ మధ్య సినీ ఫీల్డులోకి... అయితే ఎబి రామ్ వర్మ అనే కుర్రాడు 2013 మిస్టర్ ఆంధ్రా కిరీటం సొంతం చేసుకొని, తనూ నటనలో నిరూపించుకుంటానంటూ ఓ అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ‘హోరా హోరీ’లో నటిస్తున్నాడు. తనకు ఈ అవకాశం రావడం గురించి చెప్పుకుంటూ... ‘ఒక వాణిజ్య ప్రకటన కోసం తేజ నటీనటుల్ని వెతుకుతున్నారని తెలిసి ఫొటోలు పంపించాను. ఆ తర్వాత ఓ ఆరేడు రౌండ్లు పరీక్షించి హీరోగా ఎంపిక చేసుకున్నా’రన్నాడు. అయితే అంతకంటే ముందు ఈ కుర్రాడు సినిమా ఛాన్స్ ల కోసం తెగ ప్రయత్నించాడట. ఓ సినిమాలో గుర్తింపు లేని పాత్ర ఒకటి చేశాడట. ఆ తరువాత ఇంట్లో వాళ్ళ సలహాతో నటనను పక్కన పెట్టి అమెరికా వెళ్ళి ఎంబిఎ పూర్తి చేశాడట. తిరిగి వచ్చి మళ్ళీ అదే నటన వైపు ఆకర్షితుడై దేవదాస్ కనకాల ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నాడు. దీంతో హోరీ హోరీలో ఓ చెడ్డ పోలీసు పాత్రకు నటించే అవకాశం చేజిక్కించుకున్నాడు. తేజా సినిమాలో ఛాన్స్ రావడంపై రామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గొప్ప హీరోలెందరో ఈయన దగ్గర తొలిసారిగా నటించిన వారున్నారని అన్నాడు.