అభిమానానికి అడ్డు ఏముంది? అది కొన్నిసార్లు హద్దులు లేకుండా చెలరేగి పోతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల సూపర్ స్టార్ ఎన్టీఆర్ ఫానిజం లో కూడా ప్రస్తుతం ఇదే జరుగుతోంది. జపాన్ లో ఓ వీరాభిమాని తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ ఆ వీడియోలను యూట్యూబ్ లలో అప్ లోడ్ చేస్తున్నాడు. ఇంతకీ అతగాడు కంపోజ్ చేసే పాటలు ఎవరివనేగా మీ డౌట్. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోనివి. అంతేకాదు స్వతహాగా అతగాడు ఎన్టీఆర్ కి భయంకరమైన అభిమాని అట. జపాన్ లో రజినీకాంత్ తర్వాత అక్కడ ఆ రేంజ్ అభిమానుల్ని సంపాదించేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నిజానికి ఎన్టీఆర్ కి యమదొంగ టైం నుంచే అక్కడ భీభత్సమైన అభిమానులు తయారయ్యారు. బాద్ షా సినిమా అక్కడ ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీరాభిమాని విషయానికోస్తే... గతంలో యమదొంగ – టెంపర్- రభస- రామయ్య వస్తావయ్యా సినిమాల్లోని పాటలకు ఇలాంటి వీడియోలనే రూపొందించాడీ వ్యక్తి. ఇక ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమాలోని పాటలకు దాదాపు అలాంటి స్టెప్పులే వేసి ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక్కడ విశేషమేంటంటే... ఆయా పాటల కోసం అతగాడు జూనియర్ ఎలాంటి డ్రెస్సులు వేశాడో అలాంటివే వేసుకుని మరీ స్టెప్పులు వేస్తున్నాడు.