తమ ఫ్యామిలీపై వస్తున్న వివాదాస్పద వార్తలపై తొలిసారి నోరు విప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నటసింహ బాలకృష్ణకు, తనకు మధ్య 'వార్' జరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై వివరంగా మాట్లాడాడు. 'నాన్నకు ప్రేమతో' సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో విస్తృతంగా మాట్లాడిన సందర్భంలో ఈ విషయాలకు క్లారిటీ ఇచ్చాడు.
"బాబాయ్ కీ, నాకూ పడడం లేదని, మా మధ్య గొడవలున్నాయని రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే, నాకెవరితోనూ ఎటువంటి గొడవలూ లేవు. బాబాయ్ కీ, నాకూ మధ్య 'వార్' జరుగుతోందన్న వార్తల్లో అస్సలు వాస్తవం లేదు. ఏమీలేకపోయినా మామధ్య ఏదో ఉందంటూ వార్తలు రాస్తున్నారు. ఎవరితోనైనా నాకు విభేదాలుంటే నేనే చెబుతాను. అయినా బాబాయ్ తో నాకు మనస్పర్థలున్నాయని నేను ఎక్కడైనా చెప్పానా? లేక బాబాయ్ చెప్పారా? లేదు కదా? ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే" అన్నాడు ఎన్టీఆర్.
"మేమంతా ఒకే కుటుంబం. నా తండ్రి తరువాత తండ్రి అంతటి మనిషి బాబాయ్. నాకు తండ్రి ఎంతో బాబాయ్ కూడా అంతే. 'నాన్నకు ప్రేమతో' సినిమా లాగానే రేపు 'బాబాయ్ కి ప్రేమతో' అనే కథ ఎవరైనా తెస్తే తప్పకుండా చేస్తా" అన్నాడు ఎన్టీఆర్ నవ్వుతూ. మొత్తానికి ఈసారి తమ ఫ్యామిలీ సంబంధాలపై సుదీర్ఘంగానే మాట్లాడాడు. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పడానికి గట్టిగా ప్రయత్నించాడు.
ఇక 'డిక్టేటర్'కి పోటీగా 'నాన్నకు ప్రేమతో' రిలీజ్ అవడంపై మాట్లాడుతూ, "బాబాయ్ సినిమా, నా సినిమా, సంక్రాంతికి రిలీజవుతున్న ఇతరుల సినిమాలు అన్నీ బాగా ఆడాలనే కోరుకుంటున్నాను. మామధ్య పోటీ కానీ, నందమూరి ఫ్యాన్స్ మధ్య క్లాష్ కానీ లేనేలేవు. అసలు నాకు ఎవరితోనూ క్లాష్ లేదు. అలా అనుకుంటే, నాగార్జున గారి 'సోగ్గాడే చిన్ని నాయన' కూడా రిలీజవుతోంది. అలాంటప్పుడు ఆయన టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'కి వెళ్లను కదా?" అంటూ ప్రశ్నించాడు ఎన్టీఆర్. బాలయ్య వేరు నాగార్జున వేరు కదా బుడ్డొడా?