బాహుబలి ఇన్సిపిరేషన్... చాలా మంది నటులకు గన్ లూ, నార్మల్ ఫైట్లూ వదిలేసి కత్తులు, బాణాలు, గధలు పట్టుకోవాలనే కోరిక కలుగుతోంది. నిజమే... ఎప్పుడూ వేసుకునే ఈ జీన్ పాంట్లూ... సూట్లూ బోరే కదా... బాహుబలి సినిమా వచ్చాక చాలా మంది నటులకు అందులో తమకూ ఓ పాత్ర ఉంటే ఎంత బాగుండేదనుకుంటున్నారు. లేదా ఇలాంటి ఓ చారిత్రక, పౌరాణిక చిత్రం చేయాలనే కోరికతో ఉన్నారు. కింగ్ నాగార్జున కూడా ఇలాంటి ఓ కోరిక బయట పెట్టారు. మరి ఈ హీరో ఇప్పటి వరకూ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్స్, భక్తి చిత్రాలూ లాంటి అన్ని వెరైటీ పాత్రలనూ టచ్ చేశాడు కానీ... పౌరాణికాలూ... చారిత్రక చిత్రాల్లో నటించలేదు. అందుకే తనకి రామాయణంలో మెయిన్ విలన్ అయిన రావణుడి పాత్రలో నటించాలని ఉందనే తన కోరికని బయటపెట్టాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ‘కాళీ’ బుక్ లాంచ్ కి హాజరైనప్పుడు నాగార్జున తన కోరికను బయట పెట్టారు. ఈ కార్యక్రమంలో నాగార్జున తనకు నచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ ‘నా చిన్నప్పటి నుంచీ ఎన్నో పౌరాణిక, జానపద కథలను వింటూ పెరిగాను. వీటితో పాటు ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ లు చేసిన పౌరాణిక సినిమాలు చూస్తూ పెరిగాను, అందుకే అలాంటి సినిమాల్లో నటించాలని ఉందని’ తెలిపాడు. అలాగే బాహుబలి గురించి మాట్లాడుతూ ‘బాహుబలి సినిమాలో నేను నటించలేకపోయినందుకు బాగా ఫీలయ్యాను, అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులపై ఈర్ష కూడా కలిగిందని’ అన్నారు. నాగార్జున ఇప్పుడు రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు ఒకటి డుయెల్ రోల్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అయితే... మరొకటి కార్తీ తో చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం రెండూ షూటింగ్ లు పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి.