ఓ సినిమా తీయాలంటే ఒకప్పటిలా లేదు పరిస్థితి. పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లతో సినిమా తీయాలంటే మొత్తం బడ్జెట్ లో సగం వారికే పోతోంది. ఇక ఇప్పటి పరిస్థితిని బట్టి సినిమా తీయాలన్నా కాస్ట్ కంట్రోల్ అనేది పెద్ద సమస్యగా మారింది. అయితే ఇలాంటి బాధ లేకుండా ఓ చిట్కా కనిపెట్టేశానని చెబుతున్నారు మహేష్ బాబు సతీమణి నమ్రత. అదేంటంటే.... ‘‘ఓ స్టార్ హీరో సినిమాకి 50కోట్ల బడ్జెట్ అనుకుంటే, అందులో 30కోట్లు హీరో డైరెక్టర్ రెమ్యునరేషన్ కే పోతోంది. ఆ డబ్బు సర్ధాలంటే బోలెడంత తతంగం. అదే ఆ సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో కో ప్రొడ్యూసర్ గానో లేక సమర్పకుడిగానో పనిచేస్తే అతడు పుచ్చుకునే పారితోషికమే పెట్టుబడిగా మారితే, ఇక అప్పుడు నిర్మాతకి కష్టం ఏం ఉంటుంది? అందుకే మేం జి.మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఓ బ్యానర్ ప్రారంభించాం. ఇక మహేష్ నటించే సినిమాలన్నిటికీ ఈ బ్యానర్ కో ప్రొడ్యూస్ చేస్తుంది’’ అని ఆమె తన ఐడియాను చెప్పుకొచ్చారు. ‘‘ఇక నుంచి నేరుగా ఫిలింమార్కెట్ లోకి ప్రవేశించినట్టే’’ అని తెలుపుతూ... ‘‘బాలీవుడ్ లో షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు అనుసరిస్తున్న పద్ధతి ఇదే. స్వయంగా సొంత బ్యానర్ లు ప్రారంభించి సినిమాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పద్ధతి వల్ల నిర్మాతకి లిక్విడ్ సమస్య తలెత్తదు. స్వేచ్ఛగా కంటెంట్ పై పెట్టుబడులు పెట్టడం కుదురుతుం’’దని నమ్రత ఈ సందర్భంగా చెప్పారు. ‘‘ఇలా హీరోనే పెట్టుబడులు పెట్టడం వల్ల నిర్మాతకు కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది. మేం మీతోనే ఉన్నాం అన్న హామీ ఉంటుంది. ఆ తర్వాత లాభాల్లోంచి వాటా తీసుకోవచ్చు’’అని చెప్పుకొచ్చారు ఆమె. ‘‘ఇకపోతే శ్రీమంతుడు సినిమా విషయంలో తాను అందరూ అనుకున్నట్లు ప్రొడక్షన్ లో వేలు పెట్టేయలేదని, కేవలం మార్కెటింగ్ పనులు మాత్రమే చూసుకుంటున్నా’’నని తెలిపారు.
ఇలా ప్రతి పెద్ద హీరో అనుసరిస్తే, సినిమా సక్సెస్ కు వారూ కొంత క్రుషిచేసినట్టు ఉంటుంది. ఒకప్పుడు సక్సెస్ తో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలెందరో ఉన్నారు. కాక పోతే ఇప్పుడు హీరో ఫ్లాపయితే... వారి ఇమేజ్ కూడా దెబ్బతింటుంది కాబట్టి హీరోలు కూడా కథ మీద, డైరెక్షన్ మీద చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు.