‘బాహుబలి' సినిమాలో పచ్చబొట్టేసిన అనే పాటలోని చివర్లో వచ్చిన ఓ సీన్ కు కొన్ని విమర్శలు వచ్చాయి. హీరోయిన్ తమన్నాను ఓ వైపు తిరుగుబాటు పోరాట యోధురాలిగా చూపిస్తూనే..... మరో వైపు ఆమెను రొమాంటిక్ సీన్లో ఇలా సెక్సీగా చూపించడంపై దర్శకుడు రాజమౌళేని విమర్శించారు కొందరు విమర్శకులు. తమన్నా, ప్రభాస్ మధ్య శృంగార సన్నివేశాలు తారా స్థాయిలో చూపించారన్నారు. దీనిపై రాజమౌళి ఓ ఇంటర్య్యూలో స్పందిస్తూ, ‘నేను ఏదైనా సీన్ రాసే సమయంలో లాజిక్ గురించి ఆలోచించను, అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా? లేదా? అనే అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాను’ అన్నారు. ‘అవంతిక క్యారెక్టర్ రెబల్ అయినప్పటికీ.... ఆమె మహిళ అనే విషయాన్ని శివుడు గుర్తు చేస్తాడు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. మరో వైపు....ప్రభాస్, తమన్నా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లపై మహిళా జర్నలిస్టు అన్నా వెట్టికాడ్ రాసిన వ్యాసం ఇపుడు చర్చనీయాంశం అయింది. ‘ది రేప్ ఆఫ్ అవంతిక' పేరుతో ప్రముఖ ఆంగ్లపత్రికలో రాసిన ఆ వ్యాసంలో ఆమె దర్శకుడు ఆ సీన్‌ను మలిచిన తీరును తప్పుబట్టారు. అవంతిక అనుమతి లేకుండా దొంగచాటుగా పచ్చబొట్టు వేయడం, అవంతిక అనుమతి లేకుండా ఆమె జుట్టు ముడివిప్పి... ఆమె వస్ర్తాలు తొలగించి...అడవిలో దొరికే సహజ రంగులతో ఆమెకు లిప్ స్టిక్ అద్దడం, కాటుక పెట్టడంపై విమర్శలు గుప్పించారు. శివుడి పాత్ర అవంతిక పాత్ర పూర్తిగా తప్పుగా ప్రవర్తించింది. బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్స్, పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమాలో ఓ అపరిచితుడు, ఓ అమ్మాయిని ఇలా చేసి...ఆమెను ముగ్గులో దించి ప్రేమలో పడేయడం చూస్తే యువతకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టవుతుందని ఆమె తన వ్యాసంలో ప్రశ్నించారు.