డిక్టేటర్ విడుదలకు సిద్ధం అవుతుండటంతో బాలయ్య వందో చిత్రంపై అంచనాలు పెట్టుకుంటున్నారు ఆయన అభిమానులు. ముందుగా బోయపాటి తో ఆ చిత్రం ఉంటుందని అనుకున్నప్పటికీ అది జరిగేలా కనిపించటం లేదు. బోయపాటి ప్రస్తుతం అల్లు అర్జున్ సరైనోడులో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ చిత్రం ఉంది. మరీ బాలయ్య వందో దర్శకుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చ. బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'ఆదిత్య 999' అనే సినిమా నిర్మాణానికి ప్రయత్నాలు అప్పట్లో జరిగిన విషయం తెలిసిందే. 'ఆదిత్య 369'కి సీక్వెల్ గా రూపొందనున్న ఈ సినిమాయే బాలకృష్ణ 100వ సినిమా అని అనుకున్నారంతా. అయితే కొద్ది రోజులుగా అది గప్ చుప్ అయిపోయింది. బోయపాటి ప్రాజెక్టు వాయిదాపడటంతో ఇప్పుడు మళ్లీ 999 తెరపైకి వచ్చింది.
ఇక ఇందులో బాలకృష్ణతోపాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించబోతున్నాడన్న వార్త షికారు చేస్తుంది. చిత్రంలో భాగంగా యువరాజుకి సంబంధించిన సీన్ ఒకటి వుందట. మోక్షజ్ఞతో ఆ పాత్ర చేయిస్తే బాగుంటుందని సింగీతం భావిస్తున్నారని అంటున్నారు. మరి అందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, లేదోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.