ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావటం ఒక ఎత్తు అయితే... అదే కంటిన్యూ చేస్తూ నిలదొక్కుకోవటం మరో ఎత్తూ. స్టార్ డమ్ లేకపోయినా వచ్చిన తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో నాని. మొదటినుంచే ఎక్కువ హీరోయిజం కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ సహజ నటుడిగా దూసుకెళ్తున్నాడు. సాధారణంగా చిన్న హీరోల సినిమాకి మార్కెట్ అంతగా ఉండదు. రేంజ్ ఎంతయినా, వరుస హిట్లు ఉన్నా ఆరేడు కోట్లకు మించదు. నాని మునుపటి చిత్రాలు కూడా అంతే. ఒక్క ఈగ తప్పించి ఏ చిత్రం కూడా ఏడు కోట్లు దాటలేదు. కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకునే పిల్లజమీందార్ కూడా ఆరు కోట్ల దగ్గరే ఆగిపోయింది. గౌతమ్ మీనన్ తో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా యూత్ లో అతని క్రేజ్ ని పెంచుతూ కాస్త ఎక్కువ కలెక్షన్లనే రాబట్టింది. కానీ, నాని తాజా చిత్రం భలే భలే మగాడివోయ్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే పెద్ద హీరోలకు మనోడు ఏం తక్కువ కాదని అనిపిస్తోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు కలెక్షన్ల్ ప్రభంజనంతో దూసుకుపోతుంది. కేవలం ఒక్క యూస్ లోనే మిలియన్ మార్క్ ను ఈ చిత్రం అందుకునేందుకు దగ్గరపడుతోంది. తాజాగా విడుదల చేసిన కలెక్షన్ల జాబితాలో భలే భలే 15వ ప్లేస్ లో నిలిచింది. పెద్ద హీరోలకు చాలా కష్టంగా సాధ్యమయిన ఈ ఫీట్ ను నాని చాలా వీజీగా సాధించడం ఇప్పుడు చర్చగా మారింది. ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు ఓ సినిమా వెనుక ఉన్నా... హీరో మార్కెట్ కూడా చిత్రానికి అవసరమే. అది తనకుందని నిరూపించుకున్నాడు నాని. భలే భలే మగాడివోయ్ తో నాని ఓ ‘మరిచిపోలేని’ హిట్, కాదు.. కాదు... ‘అంతకు మించి’ అందుకున్నాడు.