ప్రముఖ జర్నలిస్టు పసుపులేటి రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎర్రజెండా నారాయణ మూర్తి పాల్గొని మహానటులకు దక్కని పురస్కారాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీరంగారావు, ఎన్టీరామారావులు సినిమాకు చేసిన సేవలను కొనియాడుతూ వారిని భారత ప్రభుత్వం మరిచిందని ఘాటుగా విమర్శించారు. ‘ఇందిరాగాంధీకి అవసరమైందని అప్పట్లో ఎంజీఆర్ కు భారత రత్నం అవార్డును ఇచ్చారనీ, మరి బతికుంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి హోదా దక్కే నాయకుడు ఎన్టీఆర్. ఆయనకు భారత రత్నం ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు ఆర్.నారాయణ మూర్తి. బ్రిటన్ నటుడు లార్డ్ లారెన్స్ కూడా నర్తనశాల సినిమాలో ఎస్వీరంగారావు నటనను చూసి నిశ్చేష్టుడయ్యాడనీ, అంతటి మహానటుడికీ ఏ పురస్కారం దక్కలేదన్నాడు. ఎస్వీరంగారావు సెట్స్ పైకి వస్తున్నాడంటే ఎన్టీఆర్ సైతం లేచి నిలబడి గౌరవించారనీ అంతటి మహా నటుడికి పద్మశ్రీ కూడా ఇవ్వరా? అని దుయ్యబట్టాడు. అసలు ఆ మహానటుడు భారత దేశ ప్రభుత్వం గుర్తించలేదా? మన తెలుగు ఆణి ముత్యాలను మరిచే పోయామా? అంటూ ఆవేదన చెందారు. పసుపులేటి రాసిన ఎస్వీరంగారావు పుస్తకాన్నీ ఆవిష్కరించిన సభలో ఆయన తన బాధను వ్యక్తం చేశారు. ఈ మహానటులను గుర్తించి వారు చనిపోయినా వారికి తగిన సత్కారం జరగాలని కోరారు.