ఇంతవరకూ సినిమా ఫంక్షన్లకు రాని ఓ బుజ్జి సెలబ్రిటీ ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతిల ముద్దుల తనయుడే ఈ ప్రత్యేక అతిథి. తనయుడు అభిరాం, సతీమణితో కలిసి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సినిమాకు ఆదివారం లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమం ఫొటోలు ఇప్పుడు నందమూరి అభిమానులను ఆనందంతో ముంచెత్తుతున్నాయి. ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ గ్యాప్ లో ఈ సినిమాకు ప్రారంభోత్సవం చేశాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ ఆధ్వర్యంలో చేయబోతున్నారు. నవీన్ యర్నేని, వై.రవిశంకర్, మోహన్ నిర్మాతలు. దేవుడి పటాలపై చేసిన తొలి సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్ కెమెరా స్విచ్ఛాన్ చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి వారూ ఈ బుజ్జి సెలబ్రిటీని పలకరించి ముద్దు చేశారు. బృందావనం సినిమాకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ అప్పటినుంచీ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తుండగా ఆ అవకాశం ఇప్పటికి కుదిరింది. నిజానికి శ్రీమంతుడు తీయకముందే ఎన్టీఆర్ తో చేద్దామనుకున్నారట... కానీ అప్పుడు టెంపర్ సినిమాతో బిజీగా ఉండడంతో... ఈ అవకాశం ఇప్పటికి వచ్చింది.
ఈ కార్యక్రమానికి దర్శకుడు వివివినాయక్, పివిపి, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, హీరో కళ్యాణ్ రామ్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు వై.నవీన్, వై. రవిశంకర్, సి.వి.మోహన్ లు హాజరయ్యారు.