గబ్బర్ సింగ్ 2 సినిమా అనుకోవడంలోనే రెండేళ్ళు గడిచిపోయాయి. ఒక దశలో ఈ సినిమా ఉంటుందా లేదా అనుకున్నారు. చివరికి షూటింగ్ మొదలు పెట్టారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగ్ లో పాల్గొన లేదు. మళ్ళీ ఇదేంటి అనుకుంటున్న సమయానికి ఈ చిత్రానికి ‘సర్దార్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం షూటింగులో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ నుండి పవన్ కళ్యాణ్ షూటింగులో జాయిన్ అవుతున్నట్టు ఓ సమాచారం వినిపిస్తోంది. ఈ వార్తల ప్రకారం జులై 29 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందని, అందులో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటిస్తుందని అప్పట్లో ప్రచారం జరిగినా.... ఆమె ఇపుడు ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారని తెలిసింది. హీరోయిన్ ఎవరు అనేది త్వరలో ప్రకటిస్తారట. సినిమా టైటిల్ గబ్బర్ సింగ్-2 టైటిల్ ‘సర్దార్' గా మార్చడం వెనక బలమైన కారణం ఉందంటున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ అంటే వచ్చే క్రేజ్ సర్దార్ అంటే రాదని కొందరు సన్నిహితులు హెచ్చిరించినా పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. దానికి కారణం లీగల్ గా టైటిల్ తో ఉన్న తలనొప్పులే అంటున్నారు. గతంలో గబ్బర్ సింగ్ చిత్రం చేసేటప్పుడు ఆ టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసిన ముంబై వారు కోర్టుకు వెళ్లారు. తర్వాత డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి తలనొప్పు ఎదురు కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సర్దార్ అన్నా బిజినెస్ అలాగే జరుగుతుందని, క్రేజ్ అలాగే ఉంటుందని పవన్ భావించినట్లు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా, పవన్ కళ్యాణ్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు.