ఇటీవల కాలంలో సిటీలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరగడంతో పాటు, అలాగే వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఈ ప్రమాదాలను తగ్గించడం కోసం హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ముమ్మరం చేశారు. అయినా పరిస్థతిలో మార్పు రాలేదు. వీకెండ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కొందరు సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ పరీక్షలకు పోలీసులకు సహకరించడం లేదు. దీంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు సినీ నటుల సహాయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘ఐ సపోర్ట్ ట్రాఫిక్ పోలీస్' కార్యక్రమంలో సినీ నటీమణులు మంచు లక్ష్మి, జయప్రద పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగా అటు వైపుగా వచ్చిన మంచు లక్ష్మి, జయప్రదతో పాటు పలువురిని పరీక్షించారు. పోలీసుల కోరిక మేరకు వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దు, కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారనే విషయం మరిచి పోవద్దు అని వారితో మాట్లాడించారు.