పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మొక్కలు పెంచడమంటే మహా ప్రీతి అన్న విషయం అందరికీ తెలుసు. ప్రకృతిని ప్రేమించే వారి లక్షణమే ఇది. ఆయన సమయం చిక్కితే హైదరాబాద్ లో ఉన్న తన ఫార్మ్ హౌస్ లో పార పట్టుకుని మొక్కల సేవ మొదలు పెడతారట. అందుకే ఆయన ప్రకృతి ఉద్యమానికి రెడీ అవుతున్నారని సమాచారం. ప్రస్తుతం వ్యవసాయమంటే ఎరువులకన్నా రసాయనాలమీదే ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ పద్ధతి సరికాదని తెలిసినా, డబ్బు సంపాదనే థ్యేయంగా నడుస్తున్న ఈ రోజుల్లో ఏది లాభసాటి అయితే దాని వెంట పరుగుతీయడం అందరికీ అలవాటైపోయింది. దీంతో అంతా కల్తీమయమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. విజయరామ్ అనే వ్యక్తితో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రసాయన సేద్యాన్ని విడిచి ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించడానికి విజయరామ్ తో కలిసి పవన్ కళ్యాణ్ తన వంతు సహాయం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను విజయరామ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. పవన్ కళ్యాణ్ ప్రకృతి ప్రేమికుడు అనే విషయం తెలుసుకున్న విజయ్ రామ్ ఆయనకు ఈ విషయం తెలిపారు. ఆయన సహకారం ఉంటే ఈ ఉద్యమం మరింత ఫలితాన్నిస్తుందని భావించిన విజయరామ్ ఆయనను కలిసి రసాయనాలు లేకుండా పంటలు ఎలా పండించాలనేది వివరించారు. తప్పనిసరిగా ఈ ఉద్యమానికి సహకరించగలనని మాట ఇచ్చారట. అయితే త్వరలో పవన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో తన అనుభవాలు, అభిప్రాయాలు వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు.