ఏ పేపరు చూసినీ, ఏ న్యూస్ ఛానెల్ క్లిక్ చేసినా ఓటుకు నోటు వ్యవహారం పై చర్చోపచర్చలు, తిట్లూ... విమర్శలూ, శాపనార్థాలూ... రకరకాల స్పందనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ నేతలు తప్ప మిగతా వారంతా ఈ అంశం గురించి ఏపీ సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీ తెలుగుదేశం నుంచి కేసీఆర్ పై ఎదురుదాడి జరుగుతోంది. ఇక చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థులు అయిన వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు, కాంగ్రెస్ వాళ్లు బాబు పై విరుచుకుపడుతున్నారు. రాజకీయ నేతల స్పందనలు ఇలా ఉండగా, ఈ అంశం గురించి ఆసక్తికరంగా స్పందించాడు ఆర్. నారాయణ మూర్తి. ఇప్పటికే రాంగోపాల్ ఈ విషయంపై స్పందించారు కూడా. ఇప్పుడు విప్లవ సినిమాల నారాయణ మూర్తి ... ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు అపప్రద అని అంటున్నారు.
ఎమ్మెల్యేల ఓట్లను డబ్బుతో కొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూడటంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై విచారణ జరిపించి దోషులపై చర్య తీసుకోవాలన్నారు. ఒంగోలుకు వెళ్లిన నారాయణమూర్తి అక్కడ ఈ అంశం గురించి స్పందించాడు. ఇంకా ఏపీ సమస్యల గురించి కూడా నారాయణ మూర్తి స్పందించాడు. విభజనతో రాష్ట్రం అన్యాయానికి గురి అయ్యిందని.. కేంద్ర ప్రభుత్వ చొరవచూపి రాష్ట్ర బాగోగులను పట్టించుకోవాలని కోరారు.