ప్రపంచవ్యాప్తంగా భారతీయ చలనచిత్ర ఖ్యాతిని బాహుబలి ద్వారా చాటిచెప్పాడు దర్శకధీరుడు జక్కన్న. స్వతహాగా పనిరాక్షసుడు కావటంతో అహర్నిశలు శ్రమించి దాదాపు నాలుగేళ్లు కష్టపడి తెరకెక్కించాడు. మధ్యలో ఎన్ని గాసిప్స్, లీకేజ్ లు వచ్చినా అన్నింటిని తట్టుకుని, నిలదొక్కుకుని విజయం సాధించాడు. ఇక ఇప్పుడు బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా రెండో పార్ట్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే పనిలో పడ్డాడు. అయితే ఈ మధ్య ఓ ఫోన్ కాల్ కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందట. అంతే కాదు టెన్షన్ తో ఆ రాత్రంతా ఆయనకు నిద్రలేకుండా చేసిందట.
అసలు విషయం ఏంటంటే... ఓ రోజు అర్ధరాత్రి జక్కన్న మాంచి నిద్రలో ఉండగా ఓ ఫోన్ కాల్ వచ్చిందట. అవతలి వ్యక్తి కంగారుగా సార్ మీరు కేరళలో షూట్ చేసిన బాహుబలి పార్ట్-2 మొత్తం యూట్యూబ్ లో లీకైంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడంట. దీంతో కంగారు పడిన రాజమౌళి మొత్తం టీం అందరికి ఫోన్ చేసి రాత్రికి రాత్రే అందరిని అలెర్ట్ చేశాడంట. మీటింగ్ పెట్టి మరీ లీక్ అయిన లింక్స్ మొత్తం బ్లాక్ చేయడానికి ప్రయత్నించగా, అలాంటివేం దొరక్కపోవటంతో అందరూ కూల్ అయ్యారట. మొత్తానికి ఆ ఆగంతకుడి కాల్ తో రాజన్నే కాదు... మొత్తం యూనిట్ సభ్యులంతా తెగ కంగారు పడ్డట్టు సమాచారం.