ఓకే బంగారం హిట్ తర్వాత దళపతి స్టైల్లో ఓ రివెంజ్ డ్రామాను తెరకెక్కించేందుకు మణిరత్నం పెద్ద ఫ్లానే వేసుకున్నాడు. అయితే అనివార్య కారణాల వల్ల ఆ క్రేజీ ప్రాజెక్ట్ అటకెక్కింది. నిత్య మీనన్, కీర్తి సురేష్ లను ముందుగా నాయికలుగా ఎంపిక చేసేశాడు. ఇక హీరోలుగా సల్మాన్ దుల్కర్, కార్తీలను ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే హీరోలు డ్రాప్ అవటంతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కాదు కాదు డిలే మాత్రం అయ్యిందట. ఇప్పుడు హీరోలను మార్చేసి త్వరలో సినిమాను సెట్లోకి తీసుకెళ్లేందుకు మణిరత్నం ఆలోచనలో ఉన్నాడు. రామానాయుడు మనవళ్లు, రియల్ లైఫ్ లో బావ, బావమరుదులు అయిన నాగ చైతన్య, రానాలతో ఈ రివెంజ్ డ్రామాను మణిరత్నం తెరకెక్కించనున్నాడంట.
నిజానికి మహేష్ నాగ్ లతో మణిరత్నం తెరకెక్కించాలనుకున్నది ఈ సినిమానే. అయితే మహేష్ సైలెంట్ అయిపోవటంతో నాగ్ కూడా ఈ ప్రాజెక్టును లైట్ తీసుకున్నాడు. దీంతో కాస్త క్రేజ్ ఉన్న కార్తీ .. దుల్కర్ సల్మాన్ కథానాయకులుగా, నిత్యామీనన్ .. కీర్తి సురేష్ కథానాయికలుగా మణిరత్నం ఈ సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. ఇక తెలుగు వెర్షన్ కి సంబంధించి దుల్కర్ స్థానంలో నానిని తీసుకున్నట్లు ప్రకటించేశారు కూడా. చివరికి కథానాయికలను అలాగే వుంచి, కథానాయకులుగా రానా .. నాగచైతన్యలతో ఆయన ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని అంటున్నారు. వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని మణిరత్నమే త్వరలో ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేయబోతున్నాడంట.