బహుభాషా నిర్మాత సినీ ప్రయాణం...

February 18, 2015 | 04:49 PM | 34 Views
ప్రింట్ కామెంట్
ramanaidu_niharonline

అభిరుచి గల నిర్మాత, మూవీ మొఘల్ సినీ అభిమానులకు పుంఖానుపుంఖాలుగా సినిమాలను అందించిన దగ్గుబాటి రామానాయుడు బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తనువు చాలించారు. తెలుగు పరిశ్రమను 1963 నుంచి 2010 వరకు దాదాపు 50 ఏళ్ళుగా ఏలిన మహానుబావుడు, శతాధిక చిత్రాలు నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. నిర్మాతగానే కాకుండా స్టూడియో, ల్యాబ్, రికార్డింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్ వంటి సినిమాకు సంబంధించిన అన్ని సదుపాయాలను సినీ పరిశ్రమకు సమకూర్చారు. పార్లమెంటు సభ్యునిగా బాపట్ల నుంచి 1999లో తెలుగుదేశం పార్టీనుంచి లోక్ సభకు ఎన్నికైనారు. 2010లో నాయుడిగారికి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఇచ్చి సత్కరించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్ అవార్డు ను అందించింది గౌరవించింది. తన సంపాదనలో అధిక మొత్తాన్ని సినిమాకే అంకితం చేస్తూ, సినిమా పరిశ్రమ ఉన్నంత కాలం ఆయనకు మరణం లేదని నిరూపించుకున్నారు. పరిశ్రమలో ప్రతి చోటా ఆయన కనిపిస్తూనే ఉంటారు. దగ్గుబాటి రామానాయుడు 1936లో ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి చనిపోవడంతో పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటిచ్చారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఉత్సాహంగా కనిపించే నాయుడిగారికి చదువు సాగలేదు. మామ కూతురు రాజేశ్వరినే పెళ్ళి చేసుకున్నారు. సురేష్, వెంకటేష్ ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఒకసారి రామానాయుడు ఊర్లో ‘నమ్మినబంటు’ అనే సినిమా షూటింగ్ జరిగి ఓ సీన్లో కూడా నటించారట. అందులో నటించిన హీరో నాగేశ్వర్ రావుగారు సినిమాల్లో నటించమని ప్రోత్సహించారట. అప్పటికి వ్యవసాయం తప్ప మరో ధ్యాసలేని రామానాయుడు, ఆ తరువాత రైస్ మిల్లు వ్యాపారం మొదలు పెట్టారు. అప్పట్లో బిల్లులు రాయడం లేదని సేల్స్ టాక్స్ వారు 2 లక్షల జరిమానా విధించారట. దీంతో వ్యాపారం దివాలా తీసి చెన్నపట్నం చేరుకున్నారు. అక్కడ సినిమావాళ్ళతో పరిచయాలు, ఆ తరువాత ‘అనురాగం’ సినిమాతో నిర్మాతగా మారిపోయారు. అక్కడినుంచి తన సినీ ప్రయాణంలో వెనుదిరిగి చూడలేదాయన. తన సినిమాలో ఎక్కడో ఓ చోట ఓ డాక్టర్ గానో, లాయర్ గానో, జడ్జిగానో, ఓ సినిమాలో విలన్ గా కూడా కనిపించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారినప్పుడు మొదట నాగేశ్వర్ రావు తరువాత రామానాయుడు హైదరాబాద్ కు వచ్చి సినిమా పరిశ్రమ ఎదగడానికి కారకులయ్యారు. తన కుమారులను నిర్మాతగా ఒకరిని, నటుడిగా మరొకరిని పరిశ్రమకు అందించారు. కేవలం తెలుగులోనే కాక చిత్రాలను అన్ని భాషల్లోనూ నిర్మించి బహుభాషా నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అసుఖ్ అనే బెంగాలీ చిత్రానికి ఉత్తమ జాతీయ పురస్కారం 1999 లో అందుకున్నారు. 1973లో జీవన తరంగాలు చిత్రానికి, 1975లో సోగ్గాడు చిత్రానికి ఉత్తమ నిర్మాతగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ