ఏ కొత్త సినిమా రాబోతుందన్నా... ఆ సినిమా గురించి ఆ సినిమాలోని పాత్రల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది... అందులో దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే మరింత ఆసక్తిగా జనం ఎదురు చూస్తుంటారు. బాహుబలి చిత్రంలో ఎంతో మంది అభిమాన స్టార్లు ఉండడం... ఎవరి పాత్ర ఏమిటో? అన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. తన సినిమా కథ.. ఆయా పాత్రల తీరుతెన్నులను క్రమంగా ప్రేక్షకుల మనస్సులలో ఇంజెక్ట్ చేయడంలో సిద్ధహస్తుడు రాజమౌళి. బాహుబలి విషయంలోనూ ఇదే పద్దతిలో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ట్రైలర్ ని, పోస్టర్స్ ని విడుదల చేసారు. తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేశాడు. రమ్యకృష్ణ ప్రతిభ ఏమిటో ఇంతకు ముందే నీలాంబరి పాత్రలో అందరూ చూశారు. సూపర్ స్టార్ రజినీకాంత్ తో పోటీగా అన్నట్టు ఉంది తన క్యారెక్టర్. తాను చేసే ప్రతి పాత్రలో పరిపూర్ణత కోసం తపిస్తుందామె. బాహుబలి చిత్రంలో ఆమె శివగామిగా కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్యకృష్ణ మేకింగ్ చూసిన వాళ్లు ఆమె ప్రతిభ చూసి మంత్ర ముగ్దులు అయ్యారు. న్యాయానికి నిలువెత్తు రూపం ఈ శివగామి అంటూ రమ్యకృష్ణ పాత్ర గురించి రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్స్ తో ఆయా క్యారెక్టర్స్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చిన రాజమౌళి.. తాజా మేకింగ్ విషయంలో మాత్రం.. పాత్రను పక్కన పెట్టి ఈ చిత్ర నిర్మాణంలో రమ్యకృష్ణ ఎమోషన్స్ పండించే తీరుని చూపించారు. గత రెండున్నర ఏళ్లుగా బాహుబలి యూనిట్ కు రమ్యకృష్ణ వెన్నుదన్నుగా నిలిచారని.. కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే రమ్యకృష్ణ పోస్టర్స్ చూసి పెదవి విరిచిన అభిమానుల కోసం శివగామిగా రమ్యకృష్ణ మేకింగ్ వీడియో విడుదల చేసి మెప్పించే ప్రయత్నం చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు రాజమౌళి. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. రెండు భాగాలు వస్తున్న బాహుబలి. మొదటి భాగాన్ని 'బాహుబలి - ది బిగినింగ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.