దిల్ రాజు రిజిస్టర్ చేసిన మూడు టైటిల్స్ లో ఒకటి మాస్ ఇప్పుడు మహారాజాకు ఉపయోగపడింది. నచ్చిన టైటిల్స్ ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తాయి కదా అని నిర్మాతలు రిజిస్టర్ చేసేస్తుంటారు. ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ పేర్లు చూస్తే ఊహాజనిత వార్తలు వెలుగులోకి రావడం మామూలే. ఈ టైటిల్ తో ఫలానా హీరోగారితో నిర్మాత కమిట్ అయ్యాడనే మసాలా వార్తలు బోలెడు ఎంటర్ టైన్ చేసేస్తుంటాయి. అలా అప్పట్లో పవన్ కళ్యాణ్ కోసం దిల్ రాజు టైటిళ్ళు రిజిస్టర్ చేశారని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన మూడు టైటిళ్ళలో ఒక టైటిల్ ను రవితేజ సినిమాకు వాడేసుకుంటున్నారు. అదే ‘ఎవడో ఒకడు’. ఇక సుప్రీం టైటిల్ ను సాయి ధరమ్ తేజకు వాడుకున్నాడు. ఇక జనగణ మన మిగిలిపోయింది. ఓ మై ఫ్రెండ్ అనే సినిమా చేసిన వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘ఎవడో ఒకడు’ సినిమాను దిల్ రాజ్ బేనర్ లో రవి తేజ హీరోగా సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతం రవితేజ, సంపత్ నంది దర్శకత్వంలో బెంగాల్ టైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.