మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చేసినట్టున్నాయి. ఇంతకు ముందు నటుల మధ్య విపరీతమైన పోటీలు, ఇగోలు కనిపించేవి... కానీ ఇప్పుడేమిటి? ఒకరి సినిమాలను మరొకరు అభినందించుకుంటున్నారు... పొగుడుకుంటున్నారు. కొన్నాళ్ళ క్రితం టైగర్, బెంగాల్ టైగర్ టైటిళ్ళ మద్య కాస్త స్పర్థలు కలిగినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడేమో... టైగర్లిద్దరూ ఒక్కటైనట్టు కనిపిస్తోంది. అటు బాహుబలి విషయంలో శ్రీమంతుడు, జక్కన్న ఒక్కటైనారు. ఇక ఇటీవల టైగర్ సినిమా విడుదలైన తరువాత సినిమా వాళ్ళు సందీప్ కు ట్విట్టర్ లోనూ, ఫోన్ ద్వారా అభినందనలు తెలుపుకుంటున్నారు. టైగర్ లో సినిమా మొదలైన అరగంట వరకు హీరో కనిపించడు అంటే ఎవరైనా ఆ సినిమాను ఒప్పుకుంటారా? మనోడు ఒప్పుకోవడమే కాదు, ఏకంగా రిలీజ్ చేసి హిట్టనిపించుకున్నాడు. ఎప్పుడో ఏప్రిల్‌లో రావల్సిన సినిమాను లేటు చేసి ఇప్పుడు జూన్‌లో వదిలినా కూడా, కంటెంట్‌లో పట్టుంది కాబట్టి ధియేటర్స్‌లో అల్లుకుపోతోంది. మొన్న అల్లు అర్జున్ ఫోన్ చేసి సూపర్ సినిమా అంటూ సందీప్‌ను ఎప్రిషియేట్ చెయ్యగా, ఇప్పుడు మాస్ రాజా ‘‘బెంగాళ్ టైగర్’’ రవితేజ ఫోన్ చేసి ‘‘టైగర్’’ను పొగిడేశాడు. ఈ అభినందనలు చూస్తుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్నేహ సహృద్భావం పొంగి పొర్లుతున్నట్టు అనిపిస్తోంది.