ఇప్పుడంతా యాంటిక్ జువెలరీ ట్రెండ్. ఆనాటి రాణులు, అమ్మమ్మలు వేసుకున్న నగలు ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయి. అందుకే కాబోలు రుద్రమదేవి నగలు అమ్మకానికి పెడుతున్నట్టు ఓ వార్త వచ్చేసింది. అంటే నిజంగా రుద్రమదేవి ధరించినవి కాదండోయ్. రుద్రమదేవి సినిమాలో అనుష్క ధరించిన నగలు. ఈ నగలను యాంటిక్ నగలనే ఉద్దేశంతో కొంటారో, లేక అభిమాన తార అనుష్కధరించినవని కొంటారోగానీ, ఇవన్నీ చెన్నై ఎన్ ఎ సీ జ్యువలెరీ షాపులో కొన్నాళ్ళు ప్రదర్శనకు పట్టి ఆ తరువాత అమ్మకానికి పెట్టబోతున్నారని అక్కడకి సినివర్గాల్లో ఓ వార్త వెలువడింది. బాంగారం పూత పూసిన ఈ భారీ నగలను ఒకరే కొనేలా ప్రచారం నిర్వహిస్తారట. అలా కొనని పక్షంలో విడివిడిగా అమ్మేస్తారట. ఈ చారిత్రాత్మక చిత్రం మార్చి నెలాఖరున విడుదల చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ట్రైలర్ కూడా విడుదల కాలేదు. దీన్నిబట్టి చూస్తే మార్చిలో విడుదలవడం కష్టమేనని కొంత మంది సినీ మేధావులు అనుకుంటున్నారు. ఈ సినిమాకు కొన్ని ఏరియాలకు బయ్యర్లు కూడా ముందుకు రానట్టు తెలుస్తోంది. దీంతో చిత్రం విడుదల విషయం డైలమాగానే కనిపిస్తోంది. ఈ చిత్రం ఆడియోను వరంగల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.