హిట్ అండ్ రన్ కేసు నుంచి కాస్త ఊపిరి తీసుకుంటున్న సల్మాన్ కు మరో కష్టం వచ్చి పడింది. సల్మాన్ మీదన్ ‘వీర్' సినిమా నిర్మాత విజయ్ గలానీ రూ. 250 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమయ్యాడట. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు జారీ చేశాడు. సల్మాన్ వల్ల తన పరువు పోయిందని, మానసిక వేదనకు గురైనట్లు చెబుతున్న గలానీ ఇంత పెద్ద మొత్తంలో పరువు నష్టం దావా వేయడం పై బాలీవుడ్ లో చర్చలకు దారి తీసింది. సల్మాన్ నటించిన ‘వీర్' చిత్రం డిజాస్టర్ అయ్యింది. నిర్మాత బాగా నష్టపోయాడు. ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ 10 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట. సినిమా హిట్టయితే రూ. 15కోట్లు ఇవ్వాలని ఒప్పందం కుదిరిందట. అయితే ఆ సినిమా మూలంగా తాను నష్ట పోయినా 15 కోట్లు ఇవ్వాలని సల్మాన్ డిమాండ్ చేశాడని ఆయన అంటున్నాడు. ఈ వివాదాన్ని తాను నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళితే, సల్మాన్ తన మీద ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసాడని విజయ్ గలానీ తెలిపారు. తన వద్ద ఒప్పంద పత్రం ఉండటం వల్ల కోర్టు తీర్పు తనకే అనుకూలంగా తీర్పు ఇచ్చిందనీ, అయితే ఈ కేసు వల్ల, సల్మాన్ వల్ల తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని లాయర్లకు ఫీజులివ్వడం కారణంగా మరింత నష్టపోయానని ఆయన చెపుతున్నాడు.