ఇది ట్విస్ట్ లా అనిపిస్తుంది కదా... నిజానికి భజరంగి భాయిజాన్ కథ రియల్ గా తప్పి పోయిన గీత కథ. ఈ అమ్మాయి గురించి అందరూ న్యూస్ పేపర్లలో చదివే ఉంటారు, భాయిజాన్ కథలో అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చింది. నిజం కథలో మాత్రం గీత ఇండియా నుంచి పాకిస్తాన్ చేరుకుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు సల్మాన్ కంకణం కట్టుకున్నాడు. ప్రస్తుతం మూగ చెవిటి అమ్మాయి గీత పాకిస్థాన్ లోని ఈది ఫౌండేషన్ లో ఆశ్రయం పొందుతోంది. ఈ అమ్మాయిని తిరిగి భారతదేశానికి రప్పించి ఆమెను ఆమె తలిదండ్రుల వద్దకు చేర్చేందుకు సల్మాన్‌ఖాన్ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నానికి భజరంగీ దర్శకుడైన కబీర్‌ఖాన్ కూడా తన వంతు సహాయం అందిస్తున్నాడు సల్మాన్ కు. మూడేళ్ళ క్రితం పాకిస్తాన్ మాజీ మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నే గీత కుటుంబాన్ని కనుగొనేందుకు భారత్ కు వచ్చాడు. కానీ ఫలితం దక్కకపోవడంతో వెనుదిగిరి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం డైరెక్టర్ కబీర్ ఖాన్ ట్విట్టర్ లో బర్నే సహాయం కోరారు. రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీసినందుకు బర్నే సల్మాన్ ను అభినందిస్తూ... సల్మాన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి బర్నే కూడా తన వంతు సహాయం చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గీత (ఈ పేరు ఈదీ ఫౌండేషన్ వారు పెట్టింది) వయసు ఇప్పుడు 22 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉండవచ్చునని, పొట్టిగా ఉండడం వల్ల చిన్నగా కనిపిస్తుందనీ, కొంగు ఎప్పుడు తల మీద కప్పుకోవడం వల్ల హిందూ పల్లెటూరి అమ్మాయి అయి ఉండవచ్చని బర్నే తెలిపాడు. హిందీలో కొద్ది కొద్దిగా రాయగలుగుతుందనీ, తనకు తన ఇంటి పేరు మాత్రం 193 అని గుర్తుందనీ, తనకు ఏడుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారని చెపుతుందని బర్నే తెలిపారు. సినిమా కథలో బర్నే పాత్రను సల్మాన్ పోషించాడు కాక పోతే అతను పాకిస్తానీ, సినిమాలోని హీరో భారతీయుడు!
గీత పాకిస్థాన్ ఎలా చేరింది: దాదాపు 15 ఏళ్ళ క్రితం గీత తప్పిపోయి ట్రైన్ లో లాహోర్ చేరుకుంది. ఆ అమ్మాయిని అక్కడి పోలీసులు గుర్తించి ఓ అనాథాశ్రమంలో చేర్చారు. అమ్మాయి మూగ చెవిటి కారణంగా తను ఎక్కడినుంచి వచ్చిందీ చెప్పలేకపోయింది. ఎన్నో అనాథాశ్రమాలు మారుతూ చివరకు పాకిస్థాన్ లోని ఈదీ ఫౌండేషన్ కు చేరింది.